హైకోర్టులో ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్..సీఎస్ ను ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతి

హైకోర్టులో ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్..సీఎస్ ను ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతి

SEC files petition in the High Court : ఏపీ ఎన్నికల సంఘం… హైకోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. సీఎస్ దాస్‌ను ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లటినీ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ఎన్నికల సంఘం… దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ను ప్రతివాదిగా చేర్చేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఎస్‌ఈసీకి సహకరించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని…నాటి సీఎం నీలం సాహ్ని, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నవంబర్‌ 3న కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ఎస్‌ఈసీ ప్రస్తావించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలు ఇంకా పూర్తి కానందున కొత్త చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ను ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతి కోరారు ఎస్‌ఈసీ తరపు న్యాయవాది. దీనికి అంగీకారం తెలిపిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

మరోవైపు పంచాయతీ ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమైనందున…ఈ దశలో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది హైకోర్టు. ఓటర్ల జాబితాలో పేరు లేదని, ఓటు కోల్పోవాల్సి వస్తుందని, రిజర్వేషన్లు సరిగా లేవని, ఇతరత్రా కారణాలను ప్రస్తావిస్తూ దాఖలైన 10 లంచ్‌ మోషన్ పిటిషన్లను కొట్టేసింది. అనుబంధ పిటిషన్లటినీ ఒకేసారి కొట్టివేయడంతో ఇక పంచాయతీ ఎన్నికలకు ఆటంకాలన్నీ తొలగిపోయినట్లయ్యింది.