ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ దూకుడు

ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ దూకుడు

SEC Nimmagadda Ramesh Focus on AP Panchayat Elections : ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ దూకుడు మీదున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని హంగులను సమకూర్చుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ స్పెషల్‌ ఫోకసే పెట్టారు. మరి నిమ్మగడ్డ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేంటి..? పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్.. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరుకానున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు, ఓటర్లజాబితా రూపకల్పన తదితర అంశాలపై చర్చ జరపనున్నారు.

ప్రధానంగా పంచాయతీల్లో భద్రతాపరమైన అంశాలపై ఉన్నతాధికారుల సమావేశంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సజావుగా జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలివ్వనున్నారాయన. పంచాయతీ ఎన్నికల నిర్వహణతో పాటు వ్యాక్సినేషన్‌పై కూడా ఈ వీడియో కాన్ఫరెన్సులో చర్చించనున్నారు. ఎస్ఈసీ నిర్వహించే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆదేశాలు వెళ్లాయి.

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ గవర్నర్‌తోనూ భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం పదిన్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో నిమ్మగడ్డ సమావేశం అవుతారు. ఎన్నికల ఏర్పాట్లు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ఎస్‌ఈసీ వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారిని నియమించారు నిమ్మగడ్డ రమేష్‌కుమర్‌. డాక్టర్‌ సంజయ్‌ని శాంతిభద్రతల పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఏకగ్రీవాలు, హింస, అల్లర్లు, కోడ్‌ ఉల్లంఘనలను ఐజీ సంజయ్‌ పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు ఆయన SECని కలిసి రిపోర్ట్‌ చేశారు. 403

ఇప్పటికే.. ఎన్నికలను రీ షెడ్యూల్ చేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌పై బదిలీ వేటు వేశారు. ఇద్దరు అధికారులను బదిలీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు.. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేయాలని ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాసింది. ఎస్‌ఈసీ లేఖతో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్, నారాయణ్ భరత్ గుప్తాలను ప్రభుత్వం జీఏడీకి సరండర్ చేసింది.

ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు కలెక్టర్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేసిన ప్రభుత్వం… చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌కు తిరుపతి అర్బన్‌ ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. మొత్తంగా.. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సీరియస్‌గా తీసుకున్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. వేగంగా పావులు కదుపుతూ.. ఎన్నికల ప్రక్రియపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారనే చెప్పుకోవాలి..!