బలవంతంగా నామినేషన్లు విత్‌ డ్రా చేసుకున్నవారికి మరో ఛాన్స్‌.. మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

బలవంతంగా నామినేషన్లు విత్‌ డ్రా చేసుకున్నవారికి మరో ఛాన్స్‌.. మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

SEC key directions on AP municipal elections : ఏపీ మున్సిపల్‌ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాత నోటిఫికేషన్‌కు కొనసాగింపుగానే నోటిఫికేషన్ ఇవ్వడంతో వివాదాలేవీ ఉండవని అందరూ భావించారు. అయితే ఇవాళ నిమ్మగడ్డ ఇచ్చిన ట్విస్ట్ సంచలనం కలిగిస్తోంది. గతంలో జరిగిన జరిగిన ఏకగ్రీవాలు, బలవంతపు నామినేషన్లపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఎక్కడైనా బలవంతంగా నామినేషన్ల జరిగినట్లు ఫిర్యాదులు వస్తే తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో ఏకగ్రీవాల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నవారు ఫిర్యాదు చేస్తే స్వీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

గతంలో జరిగిన బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించారు. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై ఫిర్యాదులు వస్తే స్వీకరిస్తామని ప్రకటించారు. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకున్న వారికి మరో అవకాశం ఇవ్వనున్నట్టు ఎస్ఈసీ వెల్లడించారు. ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు.

నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది. మార్చి 10వ తేదీన పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు విడుదల చేసింది. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా నిర్ణయించారు. 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది.

మార్చిన 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే మార్చి 13న రీపోలింగ్ ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది. అలాగే మార్చి 14 ఓట్ల లెక్కింపు జరుగనుంది. గతేడాది మార్చి 23వ తేదీన నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా 15వ తేదీకి వాయిదా పడ్డాయి. 12నగరపాలక సంస్థల్లో డివిజన్లు/వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

ఉపసంహరణ దశలో అప్పుడు ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు.. రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు దశల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. వాయిదా వేసిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.