మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీసులు

మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీసులు

SEC issued show cause notices to Minister Kodali Nani : ఏపీ మంత్రి కొడాలి నానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షోకాజ్ నోటీసులిచ్చారు. మీడియా సమావేశంలో కొడాలి చేసిన వ్యాఖ్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ అభ్యంతరం తెలిపారు. ఎన్నికల కమిషన్ పరువు, ప్రతిష్టకు భంగం కలిగేలా మీడియా సమావేశంలో మాట్లాడారని ఎస్‌ఈసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల్లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

ఆయన మాటల్లో దురుద్దేశ ప్రకటనలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. కొడాలి నాని మీడియా సమావేశం ఫుటేజ్ పరిశీలించిన తర్వాతే మంత్రి నుంచి వివరణ కోరుతున్నామని తెలిపారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు బహిరంగ ప్రకటన చేయాలని ఆదేశించారు.

మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, నిమ్మగడ్డ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ముందుగా నిమ్మగడ్డను చంద్రబాబు పొగిడారని…ఇప్పుడు ఎస్ఈసీని తిట్టడం డ్రామా అని అన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలను ఎస్ఈసీ తప్పుబట్టింది. ఈ మేరకు కొడాలికి ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే దీనిపై కొడాలి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.