గ్లాస్ డోర్ వెనుక నిమ్మగడ్డ ప్రెస్ మీట్ : ఆయన క్షేమంగా ఉండాలి..మా ప్రాణాలు బలి పెట్టాలా – ఉద్యోగ సంఘాలు

గ్లాస్ డోర్ వెనుక నిమ్మగడ్డ ప్రెస్ మీట్ : ఆయన క్షేమంగా ఉండాలి..మా ప్రాణాలు బలి పెట్టాలా – ఉద్యోగ సంఘాలు

Glass Door : ఏపీలో స్థానిక పంచాయతీ ఎన్నికల రగడ నెలకొంది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వార్ కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ముందుకు వచ్చారు. ఇందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే…రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అద్దం చాటున ప్రెస్ మీట్ నిర్వహించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. ఈ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపుతట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన తీర్పు సోమవారం వెలువడే ఛాన్స్ ఉంది.

2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే..గ్లాస్ డోర్ వెనుకాల కూర్చొని ఎన్నికలకు సంబంధించిన వివరాలు తెలియచేశారు. ఎలాంటి సమస్యలు ఉండవని నిమ్మగడ్డ వెల్లడిస్తున్నారు. సాయంత్రం కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడం, ప్రధానంగా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో ఎన్నికలు నిర్వహించడం కరెక్టు కాదని పలువురు వెల్లడిస్తున్నారు. ఆయనే అద్దం చాటున నిలబడి ప్రెస్ మీట్ నిర్వహిస్తే..తాము ఎలా విధులు నిర్వహించాలని ఏపీ ఉద్యోగ సంఘం విమర్శలు చేస్తోంది.

ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే..వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆపాల్సి ఉంటుందని ప్రభుత్వం వాదిస్తోంది. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తమ సేవలను ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు ఉద్యోగులు. తమ ప్రాణాలు రక్షించుకొనే హక్కు రాజ్యాంగం ఇచ్చిందంటున్నారు. మరోవైపు…ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి సన్నాహాలు చేస్తూ ఒకరోజు ముందు ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ అధికారితో సహా మొత్తం 9 మంది అధికారులపై విశేషాధికారాల పేరుతో చర్యలు తీసుకోవడం పట్ల ఉద్యోగ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ… రాష్ట్రంలో కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా వేసే కార్యక్రమాన్ని చేపట్టామని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వారికి వ్యాక్సిన్‌ అందించాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ వెల్లడిస్తున్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కు లేఖ ద్వారా తెలియచేశారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయో రానున్న రోజుల్లో తేలిపోనుంది.