ఎస్ఈసీ నిమ్మగడ్డ జిల్లాల పర్యటన..ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

ఎస్ఈసీ నిమ్మగడ్డ జిల్లాల పర్యటన..ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

SEC Nimmagadda Ramesh visits districts : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. బలవంతపు ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకమని, షాడో టీమ్‌లతో నిఘా పెంచాలని ఎస్‌ఈసీ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. అటు గవర్నర్‌, సీఎస్‌కు లేఖల పరంపర కొనసాగిస్తున్నారు. ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలి రోజు సందడి నెలకొంది. నేడు రెండోరోజు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష చేసేందుకు నిన్న కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇవాళ.. కడపజిల్లాలో పరిస్థితిని సమీక్షించనున్నారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరీక్షించి, అధికారులు, పోలీసులుకు తగు సూచనలు చేయనున్నారు.

సీమ పర్యటనలో ఉన్న రమేష్‌కుమార్‌.. తాను ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదన్నారు. బలవంతపు ఏకగ్రీవాలకే వ్యతిరేకమని స్పష్టం చేశారు. బలవంతపు ఏకగ్రీవాలకు ఎవరైనా అలజడి సృష్టిస్తే షాడో టీమ్‌లతో నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఏకగ్రీవాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై ఐ అండ్‌ పీ ఆర్‌ కమిషనర్‌ను వివరణ కోరిన నిమ్మగడ్డ… ఎన్నికలకు సంబంధించిన ఏ విషయమైనా ఎస్‌ఈసీ పరిధిలోనే ఉంటుందన్నారు. ఇది మాత్రమే కాదు…పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌, సీఎస్‌కు లేఖలు సంధిస్తూనే ఉన్నారు రమేష్‌ కుమార్‌.

సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సీఎస్‌కు లేఖ రాశారు. ప్రవీణ్‌ ప్రకాశ్‌ చర్యలతోనే నామినేషన్ల స్వీకరణ ఆలస్యమైందని ఆ లేఖలో ఆరోపించారు. దీనిపై స్పందించిన ప్రవీణ్‌ ప్రకాష్‌..సీఎస్‌కు లేఖ రాశారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ జరపలేదని, జీఏడీకి అధిపతిగా ఉండి.. తన ఆదేశాలను పట్టించుకోలేదన్న ఎస్‌ఈసీ ఆరోపణలను ప్రవీణ్‌ ప్రకాశ్‌ తోసిపుచ్చారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులకు సంబంధించిన అంశాన్ని మాత్రమే ప్రభుత్వానికి నివేదించానని లేఖలో ప్రస్తావించారు. వీడియో కాన్ఫరెన్స్ జరగకుండా తాను ఎలా ప్రభావితం చేయగలనో ఎస్ఈసీ చెప్పాలని సీఎస్‌ను కోరారు.

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు ఉంచటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు SEC నిమ్మగడ్డ. ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫోటో లేకుండా జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అటు ప్రభుత్వ పెద్దలను టార్గెట్‌ చేస్తూ లేఖాస్త్రం సంధించారు ఎస్‌ఈసీ. తనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సజ్జలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను నిమ్మగడ్డ కోరారు. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరోపిస్తూ…సజ్జలను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.