ఏపీ పంచాయతీ ఎన్నికలు.. పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్స్

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్స్

SEC statement Release on AP Panchayat Election Management : ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగసంఘాల అభ్యంతరాలపై ఎస్ఈసీ స్పందించింది. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని తెలిపింది. పోలింగ్ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్ లు సరఫరా చేస్తామని చెప్పింది. వ్యాక్సినేషన్ లో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయని తెలిపింది. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటిరారని కొనియాడింది.

మరోవైపు ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం ముదురుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఇది కరెక్ట్ టైం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ ఇవ్వడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ పరిస్థితుల్లో… జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది.

ఎస్ఈసీ నోటిఫికేషన్‍‌ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుత పరిణామాలను వివరిస్తూనే… షెడ్యూల్‌పై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. పరిస్ధితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై సోమవారం పూర్తి స్థాయిలో విచారించనుంది.