ఏపీ రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం..సర్పంచ్ బరిలో 7,507 మంది అభ్యర్థులు

ఏపీ రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం..సర్పంచ్ బరిలో 7,507 మంది అభ్యర్థులు

panchayat elections : ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఏజెన్సీ గ్రామాల్లో మ.1.30 గంటల వరకే పోలింగ్ జరుగనుంది. 167 మండలాల్లోని 2,786 పంచాయతీలకు రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 29, 304 కేంద్రాల్లో పోలింగ్ మొదలైంది. సర్పంచ్ స్థానాలకు 7వేల 507 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 20,817 వార్డులకు 44,876 మంది పోటీలో ఉన్నారు.

రెండో విడతలో 3వేల 328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ కాగా.. 539 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో.. మిగిలిన 2వేల 786 చోట్ల సర్పంచి పదవులకు పోలింగ్‌ జరుగుతోంది. రెండో విడత గ్రామాల్లో 33వేల 570 వార్డులుండగా 12వేల 604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో.. మిగిలిన 20వేల 817 వార్డులకు పోలింగ్‌ జరగుతోంది. వార్డులకు 44వేల 876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.

రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం 29వేల 304 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు తదితర సామగ్రితో పోలింగ్‌ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 4వేల 181 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా, 5వేల 480 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పోలింగ్‌ విధుల్లో 81వేల 327 మంది సిబ్బంది పాల్గొంటుండగా.. 4వేల 385 మంది జోనల్‌ అధికారులు, రూట్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుగా వ్యవహరించనున్నారు.

పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. నాలుగు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఓట్ల లెక్కింపు రాత్రి కూడా నిర్వహించే పక్షంలో తగినన్ని లైట్లు, సిబ్బందికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. ఐదు వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో అదనంగా ఒక అధికారిని నియమించాలని, పెద్ద పంచాయతీలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్వోకి సహాయంగా గెజిటెడ్‌ అధికారిని నియమించుకోవాలని ఎన్నికల కమిషనర్ సూచించారు.