సెల్ఫీ వీడియోల కలకలం : ఆరోపణలను ఖండిస్తున్న నేతలు

  • Published By: madhu ,Published On : November 11, 2020 / 07:07 PM IST
సెల్ఫీ వీడియోల కలకలం : ఆరోపణలను ఖండిస్తున్న నేతలు

selfie videos In Kurnool : కర్నూలు జిల్లాలో సెల్ఫీ వీడియోలు కలకలం రేపుతున్నాయి. తనను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసుకొని కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్‌ సలాం ఘటన మరవక ముందే జిల్లాలో మరో వీడియోలు తెరపైకి వచ్చాయి. వస్తున్న ఆరోపణలను నేతలు ఖండిస్తున్నారు.



నంద్యాలలో నిద్రమాత్రలు మింగిన మహిళ :-
కర్నూలు జిల్లా నంద్యాలలో మరో ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.. లక్ష్మీదేవి అనే మహిళా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ ఆత్మహత్యాయత్నం వెనుక రాజకీయ ఒత్తిడిలు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.. ఓ స్థల వివాదమే పరిస్థితిని ఇక్కడికి తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ స్థలం అన్యాయంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని… ఇప్పుడు తమ స్థలం విక్రయించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ వేధింపులు తాళలేక తాను ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు.



ఎమ్మెల్యే కుమారుడే కారణం :-
లక్ష్మీదేవి ఆత్మహత్యాయత్నానికి ఓ ఎమ్మెల్యే కుమారుడు కారణమని బాధితురాలి కూతురు ఆరోపించారు. తమ భూమిని కాజేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని.. మహిళలం అన్న కనికరం లేకుండా ప్రతి రోజు తమను టెన్షన్‌ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ స్థలం కాజేయడానికి తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతోనే తన తల్లి ఆత్మహత్యాయత్నం చేసిందని రోపించారు.
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమపై ప్రతికారం తీర్చుకున్నట్టు వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదన్నారు లక్ష్మీ దేవి కూతురు. ఆ భూమిని ఎవరికి విక్రయించకుండా అడ్డుకుంటున్నారని.. ఈ విషయంలో తమకు సీఎం వైఎస్ జగన్‌ న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. లేదంటే.. కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



ఖండించిన ఎమ్మెల్యే కాటసారి రామిరెడ్డి :-

తమ భూమి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే కాటసారి రామిరెడ్డి. తాను ఎక్కడ దౌర్జన్యం చేశానో చెప్పాలని.. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.. నేను ఎమ్మెల్యే అయిన ఒకటిన్నర సంవత్సరంలో ఎప్పుడూ కూడా వారిని కలవడం కానీ.. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదన్నారు.. వీరారెడ్డి అనేవ్యక్తి నుంచి భూమిని కొనుగోలు చేశానని.. లక్ష్మీ దేవి, భాగ్యమ్మ, శ్రీనివాస్‌ రెడ్డి మాయమాటలు చెపుతున్నారన్నారు. తమ బంధువులకు అన్యాయం చేస్తూ తమపైనే ఆరోపణలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే కాటసాని.



కాంట్రాక్టర్ కుమారుడు :-
ఓ ఎమ్మెల్యే తమను వేధిస్తున్నాడంటూ మునాఫ్‌ అనే కాంట్రాక్టర్‌ కుమారుడు సూరజ్‌ సెల్ఫీ వీడియో తీశారు. ఓ ఎమ్మెల్యే వల్ల తమ కుటుంబం రోడ్డున పడుతుందని.. తమకు న్యాయం చెయ్యకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఎలక్ట్రికల్ కాంట్రాక్టుకు సూరజ్ అనే కాంట్రాక్టర్ టెండర్ వేసి దక్కించుకున్నాడు. అయితే అలాట్‌మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయకుండానే ఎమ్మెల్యే ఒంగోలుకు చెందిన మరొక కాంట్రాక్టర్‌ మాధవరావుకు కాంట్రాక్టు ఇప్పించారని మునాఫ్‌ ఫ్యామిలీ ఆరోపిస్తోంది. తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా.. దానిని పట్టించుకున్న నాథుడే లేడని వాపోయింది.




స్పందించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి:-

కాంట్రాక్టర్‌ మునాఫ్‌ కుటుంబ సభ్యుల ఆరోపణలపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి స్పందించారు. కాంట్రాక్టర్లను బెదిరించాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. టెండర్లు ఎవరు తక్కువ ధరకు వేస్తే వారికే దక్కుతుందని.. ఇందులో ఎమ్మెల్యే ప్రమేయం ఉండదన్నారు. తనమీద ఆరోపణలు చేస్తోన్న కాంట్రాక్టర్‌ మునాఫ్‌.. తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కోటి 34 లక్షల వర్క్‌ చేశారని తెలిపారు. నేను లాక్కోవాలనుకుంటే ఎమ్మెల్యే అయినప్పుడే లాక్కొనేవాడినని.. ఇన్ని రోజులు మునాఫ్‌ ఎలా వర్క్‌ చేస్తాడని ప్రశ్నించారు.