వైసీపీలో ఇమడలేకపోతున్నారట.. టీడీపీని వీడి తప్పు చేశానని తెగ ఫీలైపోతున్న కడప జిల్లా సీనియర్ నేత

  • Published By: naveen ,Published On : October 30, 2020 / 11:07 AM IST
వైసీపీలో ఇమడలేకపోతున్నారట.. టీడీపీని వీడి తప్పు చేశానని తెగ ఫీలైపోతున్న కడప జిల్లా సీనియర్ నేత

rama subba reddy: కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో గుర్తింపు పొందిన పొన్నపురెడ్డి కుటుంబం మొన్నటి ఎన్నికల తర్వాత వైసీపీలోకి చేరింది. రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి అధికార పార్టీలోకి చేరినప్పటి నుంచి అక్కడ ఇమడలేకపోతున్నారని అంటున్నారు. జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో రామసుబ్బారెడ్డికి అస్సలు పొసగడం లేదంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి సీనియర్ అయిన రామసుబ్బారెడ్డిని అస్సలు పట్టించుకోవడం లేదని టాక్.

చిన్నచూపు చూస్తున్నారని రామసుబ్బారెడ్డి ఆవేదన:
వైసీపీలో ముఖ్యంగా జమ్మలమడుగులోని స్థానిక నేతలు తనను చిన్నచూపు చూస్తున్నారని రామసుబ్బారెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన సొంత ఇల్లయిన తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. సుధీర్ రెడ్డి వ్యవహార శైలిపై తన అనుచరుల దగ్గర చెప్పుకొని ఫీలవుతున్నారట రామసుబ్బారెడ్డి. తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యం ఉండేదని తలచుకుంటూ తెగ బాధపడిపోతున్నారని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

శివారెడ్డి హత్య తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి రామసుబ్బారెడ్డి:
జమ్మలమడుగులో పొన్నపురెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉంది. బాంబుల శివారెడ్డిగా పేరు పొందిన పొన్నపురెడ్డి శివారెడ్డి ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. 1993లో ఓ బాంబు దాడిలో శివారెడ్డి హత్యకు గురయ్యారు. ఆ తర్వాత శివారెడ్డి సోదరుడి కుమారుడు రామసుబ్బారెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు.

రామసుబ్బారెడ్డి వ్యతిరేకించినా ఆదిని ఆహ్వానించిన చంద్రబాబు:
1994, 1999లో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిపై రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు కూడా మంత్రిగా పనిచేశారు. ఆయన టీడీపీలో ఉండగా పార్టీ మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వరుసగా ఆదినారాయణరెడ్డి చేతిలో ఓడిపోతూ వచ్చారు రామసుబ్బారెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా రామసుబ్బారెడ్డి మాత్రం ఓడిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి 2016లో టీడీపీలో చేరారు. ఆయన చేరికను రామసుబ్బారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించినా చంద్రబాబు సర్దిచెప్పారు. ఆదికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడిన రామసుబ్బారెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ప్రభుత్వ విప్ పదవిని కట్టబెట్టారు చంద్రబాబు.

వైసీపీలోకి పొన్నపురెడ్డి ఫ్యామిలీ:
టీడీపీలో రామసుబ్బారెడ్డి ఉండగా చాలా సందర్భాల్లో ఆయనను పార్టీ ఆదుకుందని చెబుతారు. పొన్నపురెడ్డి కుటుంబానికి కూడా అన్ని విధాలా అండగా నిలిచిందంటారు. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాలకు తొలి నుంచి వైరం ఉంది. జంట హత్యల కేసు విషయంలోనూ టీడీపీ ఆయనకు అండగా నిలబడింది. ఆది, రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్యను కుదిర్చారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ సర్కారు ఏర్పాటైంది. కొన్నాళ్ల పాటు అటూ ఇటూ ఊగిసలాడిన పొన్నపురెడ్డి ఫ్యామిలీ.. చివరకు టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయింది.

తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన నోటికి ఎంతొస్తే అంత మాట అంటున్నారని ఆవేదన:
ఈసారి రామసుబ్బారెడ్డి చేరికను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పదేపదే వ్యతిరేకించారు. వైసీపీలో రామసుబ్బారెడ్డి చేరి 8 నెలలవుతున్నా సుధీర్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలకు పిలవలేదంటున్నారు. గతంలో ఆదినారాయణరెడ్డితో కలసి రామసుబ్బారెడ్డి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుధీర్ రెడ్డి చిన్న, పెద్ద తేడా లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటున్నారని రామసుబ్బారెడ్డి తన అనుచరుల దగ్గర వాపోయారని సమాచారం.

గతంలో ఆదినారాయణరెడ్డితో కలసి పని చేసినా ఇన్ని ఇబ్బందులు లేవట:
తన కార్యకర్తలకు, తనకు ప్రతి విషయంలో సుధీర్ రెడ్డి అడ్డుపడుతున్నారని రామసుబ్బారెడ్డి చెబుతున్నారట. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయిందని టాక్. సుధీర్ రెడ్డి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో రామసుబ్బారెడ్డి పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. గతంలో ఆదినారాయణరెడ్డితో కలసి పని చేసినా ఇన్ని ఇబ్బందులు లేవని వాపోతున్నారట. తెలుగుదేశం పార్టీని వీడి అనవసరంగా తప్పు చేశానని భావిస్తున్నారని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మరి సొంత పార్టీలో చేరేందుకు సిద్ధమవుతారో లేదో చూడాలి.