Maoists Surrender: 20 లక్షల రివార్డ్.. లొంగిపోయిన మావోయిస్టు కీలకనేత

మావోయిస్టు కీలక నేత జలంధర్ రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయారు. జలంధర్ రెడ్డి 22 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటూ అనేక హోదాల్లో పనిచేశాడు. ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్‌ జోన్‌ కమిటీ (ఏఓబీ ఎస్‌జెడ్‌సీ) సభ్యుడిగా ఉన్నారు.

Maoists Surrender: 20 లక్షల రివార్డ్.. లొంగిపోయిన మావోయిస్టు కీలకనేత

Maoist Surrender

Maoists Surrender: మావోయిస్టు కీలక నేత జలంధర్ రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయారు. జలంధర్ రెడ్డి 22 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటూ అనేక హోదాల్లో పనిచేశాడు. ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్‌ జోన్‌ కమిటీ (ఏఓబీ ఎస్‌జెడ్‌సీ) సభ్యుడిగా ఉన్నారు. 20 ఏళ్ల వయసులో మావోయిజం వైపు ఆకర్షితుడైన జలంధర్ రెడ్డి 1999-2000 లలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

మావోయిస్టు పార్టీలో చేరి అనేక హోదాల్లో పనిచేశాడు. హోదా మారినప్పుడల్లా అతడి పేరు మారుతూ ఉండేది. ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్‌ కృష్ణ అలియాస్‌ మారన్న, అలియాస్‌ కరుణ, అలియాస్‌ శరత్ ఆలా అనేక పేర్లు ఉన్నాయి ఇతడికి. 40 ఏళ్ల జలంధర్ రెడ్డి స్వస్థలం పూర్వపు మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం భూపల్లి గ్రామం.

సిద్ధిపేట ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే జలంధర్ రెడ్డి మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యాడు.. మావోయిస్టు అనుబంధ సంస్థ రాడికల్ విద్యార్థి పరిషత్ లో పనిచేశారు. అటునుంచి అడవి బాట పట్టారు. ఆరు నెలలపాటు శిక్షణ పొంది మావోయిస్టుగా మారారు. అనేక హోదాల్లో పనిచేశారు. 19 ఎన్కౌంటర్లను ఎదురుకున్నారు జలంధర్ రెడ్డి. పోలీస్ స్టేషన్ల పేల్చివేత కేసుల్లో యితడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

ఇతడిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. కానీ ఎవరు ఇతడి జాడ చెప్పడానికి దైర్యం చెయ్యలేదు. మంగళవారం జలంధర్ రెడ్డి స్వతహాగా వచ్చి లొంగిపోయారు.

ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాట్లాడుతూ..మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయే మావోయిస్టులకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయ పునరావాస ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు గిరిజన ప్రజలకు చక్కగా అందుతున్నాయని.. దీంతో వారు మావోస్టులకు సహకరించడం లేదని డీజీపీ తెలిపారు.

ఈ కారణం చేతనే ఏఓబీలో మావోయిస్టులు పట్టు కోల్పోయారని, గడిచిన రెండేళ్లలో అనేక మంది లొంగిపోయారని వివరించారు. జలంధర్‌పై ఉన్న రూ.20 లక్షల రివార్డు మొత్తాన్ని ఆయన సహాయ పునరావాస కార్యక్రమానికి వినియోగిస్తామని డీజీపీ చెప్పారు.

జలంధర్ రెడ్డి కుటుంబ నేపథ్యం చూసుకుంటే..

జలంధర్ రెడ్డి భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఆయన కుటుంబంలో అందరు విద్యావంతులే. ఆయనతాత పద్మారెడ్డి పోలీస్ పటేల్, తండ్రి బాలకృష్ణా రెడ్డి వీఆర్వోగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. 50 ఎకరాల పొలం ఉంది. వీరు ముగ్గురు సోదరులు ముగ్గురు ఉన్నత విద్యనే అభ్యసించారు. ముగ్గురు సోదరుల్లో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మరొకరు వ్యవసాయం చేస్తున్నారు. ఇక జలంధర్ రెడ్డి లొంగుబాటుపై తల్లిదండ్రులు బాలకృష్ణారెడ్డి సులోచన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.