స్నేహితుడి తండ్రి సంవత్సరీకానికి వచ్చి పెన్నానదిలో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

స్నేహితుడి తండ్రి సంవత్సరీకానికి వచ్చి పెన్నానదిలో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

Seven students drowned in Penna river : అప్పటి వరకు అందరితో ఆనందంగా గడిపారు. కబుర్లు చెప్పుకుంటూ స్నేహితులంతా సంతోషంలో మునిగిపోయారు. సరదా కోసం పెన్నానదిలో స్నానానికి దిగారు. అంతే.. ఉన్నట్టుంటి ఏడుగురు నది నీటిలో గల్లంతయ్యారు. ఇప్పటికి ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగిలిన ఐదుగురి కోసం సెర్చింగ్‌ నడుస్తోంది. సంవత్సరీకానికి వచ్చి పెన్నానదిలో ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. కడప జిల్లా సిద్దవటం మండలంలో జరిగిన ఈ ఘటన అందరిలో విషాదం నింపింది.

సిద్దవటం ఆకులవీధిలోని రామచంద్రయ్య అనే వ్యక్తి 11 నెలల క్రితం చనిపోయాడు. ఆయన సాంవత్సరీకం స్వగ్రామం సిద్దవటంలో నిర్వహించేలా బంధువులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రయ్య కుమారుడు ఇరువూరి శివకుమార్‌ అనే ఇంటర్‌ విద్యార్థి తిరుపతి నుంచి స్నేహితులు పది మందిని వెంటపెట్టుకుని సిద్దవటానికి వచ్చాడు. గురువారం సాయంత్రం వీరంతా సిద్దవటం ఆనుకున్ని ఉన్న పెన్నానదిలో పరవళ్లను చూడటానికి వెళ్లారు. అందులో ముగ్గురికి ఈత రాదు. మిగిలిన వారు సరదాగా ఈత కొట్టాలనుకున్నారు.

బట్టలు, చెప్పులు, సెల్‌ఫోన్లు గట్టున ఉంచి నీళ్లలోకి దిగారు. శివకుమార్‌ తన జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ గట్టున పెట్టేందుకు నీళ్లలోంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో వారిలో కొందరు నదీ ప్రవాహంలో కొట్టుకుపోగా మిగిలిన వారు సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోయారు. వీరిని కాపాడేందుకు వెంటనే శివకుమార్‌ నీళ్లలోకి దూకి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అతను కూడా ఎక్కువ నీళ్లు మింగేయడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

యువకులు గల్లంతు సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నీటిలో గల్లంతయిన వారి కోసం గాలించారు. సోమశేఖర్‌, రాజేష్‌ మృతదేహాలను బయటకు తీశారు. జశ్వంత్‌, జగదీష్‌, సతీష్‌, షన్ను, తరుణ్‌ అనే వారి కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు తిరుపతిలోని వారి బంధువులకు సమాచారం అందించారు.

గల్లంతయిన వారి కోసం రెస్క్యూటీమ్‌ సిబ్బంది బోట్ల ద్వారా గాలించారు. బోట్ల ద్వారా సెర్చింగ్‌ నిర్వహించారు. రాత్రి కావడంతో విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేసి గాలించారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. వర్షం అడ్డంకిగా మారడంతో రాత్రి 9 గంటల సమయంలో గాలింపును ఆపేశారు. ఈ ఉదయం మళ్లీ గల్లంతయిన వారి కోసం సెర్చింగ్‌ మొదలుపెడతారు.