గోదావరి ఉగ్రరూపం…దేవీపట్నం మండలంలో నీట మునిగిన పలు గ్రామాలు

  • Published By: bheemraj ,Published On : August 16, 2020 / 05:11 PM IST
గోదావరి ఉగ్రరూపం…దేవీపట్నం మండలంలో నీట మునిగిన పలు గ్రామాలు

ఏపీలో వానలు ముంచెత్తున్నాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్ట ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చి సమీప గ్రామాలను ముంచేసింది. భారీ వరదలతో దేవీపట్నం పలు గ్రామాలు నీటి మునిగాయి. ముంపు గ్రామాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.



గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆ గ్రామాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగువ నుంచి వరదతోపాటు తూర్పు ఏజెన్సీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలవరం కాపర్ డ్యామ్ భారీగా వరద నీరు చేరుకుంది.

బ్యాక్ వాటర్ రూపంలో దేవీపట్నం మండలాన్ని పూర్తిగా ముంచెత్తిన పరిస్థితి నెలకొంది. పూడిపల్లి గ్రామ పూర్తిగా నీటి మునిగింది. గ్రామ ప్రజలు తమ విలువైన సామాన్లతో కొండపైకి వెళ్లారు. అధికారులు వారందరినీ సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.



గతేడాది కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఆ సమయంలో దేవీపట్నం మండలంలోని 36 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది కూడా మరోసారి వరదలు ముంచెత్తడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. భారీగా నీరు చేరడంతో పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

వరద మరింత పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అంచాన వేస్తున్నారు. రేపు, ఎల్లుండి తూర్పు ఏజెన్సీతోపాటు తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వరద ఉధృత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యగా కరెంట్ నిలిపివేయడంతో అంధకారంలో ఉంటున్నారు. చుట్టూ నీరున్నా కూడా తాగడానికి నీరు లేని పరిస్థితి దాపురించింది.