కర్నూలు జిల్లాలో మరో వజ్రం లభ్యం, గొర్రెల కాపరిని వరించిన అదృష్టం

  • Published By: naveen ,Published On : July 4, 2020 / 08:35 AM IST
కర్నూలు జిల్లాలో మరో వజ్రం లభ్యం, గొర్రెల కాపరిని వరించిన అదృష్టం

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో మరో వజ్రం లభ్యమైంది. ఈసారి పగిడిరాయిలో ఓ గొర్రెల కాపరికి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని అతడు స్థానికి వ్యాపారికి రూ.3.60లక్షలకు విక్రయించాడు. అయితే ఆ వజ్రం విలువ ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. గొర్రెల కాపరిని మోసం చేసి వజ్రాల వ్యాపారి తక్కువ ధరకే దాన్ని కొన్నట్టు స్థానికులు అనుకుంటున్నారు. గొర్రెల కాపరికి వజ్రం దొరకడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ప్రాంతంలో ఈ సీజన్ లో వజ్రాలు దొరకడం చాలా కామన్ అని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలువురికి విలువైన వజ్రాలు లభించినట్టు వార్తలు వచ్చాయి.

తొలకరితో రాయలసీమలో రత్నాల వేట, దొరికితే లక్షాధికారే:
ఆ ప్రాంతంలో తొలకరి జల్లులు పడితే చాలు భూమి నుండి వజ్రాలు బయటకు వస్తాయి. రత్నాల పంటలే పండుతాయి. చినుకు పడితే చాలు వజ్రాలు నేలను చీల్చుకొని ఆకాశం వైపు చూస్తాయి. తొలకరి వర్షాలు పడితే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని కొన్ని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. తొలకరి జల్లులు వారికి మరింత ప్రత్యేకంగా మారతాయి. తొలకరి పలకరింపు కొంతమందిని లక్షాధికారులుగా మారుస్తుంది. అయితే అది వారి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. వానాకాలం వచ్చిందంటే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పలు గ్రామాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. పొలాల్లో వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతుంటాయి.

వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వజ్రాల వేట:
వజ్రాలను వెతకడానికి స్థానికులు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుండి సైతం ఇక్కడికి వస్తుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మహిళలు చంటి బిడ్డలతో వచ్చి మరీ వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ వజ్రాల వేట కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఆ ప్రాంతాల్లో వందల సంఖ్యలో వజ్రాలు దొరికాయి. గత నెల రోజుల వ్యవధిలో సుమారు 6 వజ్రాలు దొరికాయని తెలుస్తోంది. కాగా, ఈ వజ్రాల వేట స్థానిక రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కడెక్కడ నుంచో వస్తున్న జనం డైమెండ్స్ కోసం పొలాలను ఇష్టానుసారంగా తొక్కేస్తున్నారట. దీంతో పొలం దున్నేటప్పుడు తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. దీనిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

Read:టబ్‌లు, టాయిలెట్ల నుంచి స్విమ్మింగ్‌పూల్‌ల వరకూ అంతా బంగారమే!!