ఏపీలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై సిట్ విచారణ

ఏపీలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై సిట్ విచారణ

Sit inquiry into destruction of temples and idols in AP : ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై సిట్ విచారణ చేపట్టాలని భావించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేసును సీఐడీ నుంచి సిట్ కు బదిలి చేసింది.

దీంతో ఏపీలో ఆలయాలపై దాడుల ఘటనపై విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 16 మందితో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా ఐపీఎస్ అధికారి జీవీజీ అశోక్ కుమార్ నియమించింది. జీవీజీ అశోక్ కుమార్ ప్రస్తుతం ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా ఉన్నారు. సిట్ టీమ్ లో కృష్టా జిల్లా ఏస్పీ రవీంద్రనాథ్ బాబు ఉన్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలను వైసీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మత సామరస్యంపై ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందుకుగాను రాష్ట్ర, జిల్లా స్థాయిలో మత సామరస్య కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ నేతృత్వంలో 20 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

ఈ కమిటీలో హోం, దేవాదాయ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడేందుకు కమిటీలు పని చేయనున్నాయి.