చిన్నారి ప్రాణం తీసిన స్నాక్స్, గొంతులో ప్లాస్టిక్ బొమ్మ ఇరుక్కుని మౌనిక మృతి

  • Published By: naveen ,Published On : October 5, 2020 / 11:29 AM IST
చిన్నారి ప్రాణం తీసిన స్నాక్స్, గొంతులో ప్లాస్టిక్ బొమ్మ ఇరుక్కుని మౌనిక మృతి

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చినగుడబలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో ప్లాస్టిక్ బొమ్మ అడ్డుపడటంతో చిన్నారి మౌనిక మృతి చెందింది. స్నాక్స్ ప్యాకెట్‌లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మను మింగేసింది. ఆ బొమ్మ గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. ఏమరుపాటు కారణంగా కూతురు ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.



గొంతులో ఇరుకున్న ప్లాస్టిక్ బొమ్మ:
మౌనిక వయసు ఏడాదిన్నర. ఈ ఘటన గరుగుబిల్లి మండలం చినగుడబలో ఆదివారం(అక్టోబర్ 4,2020) చోటుచేసుకుంది. స్థానిక ఎస్సీ వీధికి చెందిన సంధ్యారాణి తన ఏడాదిన్నర కుమార్తె మౌనికకు పొడుగాటి తినుబండారాలు ఉండే స్నాక్స్ ప్యాకెట్‌ ఇచ్చింది. అందులోని ఆట బొమ్మను కూడా మింగేసింది. పాప స్పృహతప్పి పడిపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించింది. డాక్టర్లు పోస్టుమార్టం చేసి గొంతులో ఇరుక్కున్న ఆట వస్తువును బయటకు తీశారు. ఘటనపై పాప తల్లిదండ్రులు గురుగుబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.



తల్లిదండ్రులూ.. బీ కేర్ ఫుల్:
పిల్లలను అట్రాక్ట్ చేసేందుకు పలు కంపెనీలు అమ్మే స్నాక్స్ ప్యాకెట్లలో ఆటబొమ్మలు ఉంచుతున్నాయి. ప్లాస్టిక్ తో చేసిన ఆ బొమ్మలు చూసి చిన్న పిల్లలు మురిసిపోతూ ఉంటారు. తినడం అయిపోయాక సరదాగా వాటితో ఆడుకుంటారు. ఆ ప్లాస్టిక్ బొమ్మే ఇప్పుడు ఓ చిన్నారి నిండు ప్రాణం తీసింది. ఆ పాపకు ఏడాదిన్నరకే నూరేళ్లు నిండాయి. ఇంత ఘోరం జరుగుతుందని అస్సలు ఊహించలేదని వాపోతున్నారు.

Baby Girl Last Breath After Eat Playing Toy Along With Kurkure In Vizianagaram - Sakshi

కాగా, పిల్లలకు ఏవైనా తినే వస్తువులు కనిపించినప్పుడు పెద్దలు కచ్చితంగా దగ్గర ఉండాలి. ప్యాకెట్ లో ఏమున్నాయో గమనించాలి. అభంశుభం తెలియని పిల్లలకు తినే వస్తువు ఏదో, తినకూడని వస్తువు ఏదో తెలీదు. చేతికి ఏది చిక్కితే దాన్ని నోట్లో వేసుకుంటారు. అందుకే, తల్లిదండ్రులు కచ్చితంగా వారిపై కన్నేసి ఉంచాలి. మౌనిక విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం పాప ప్రాణం తీసింది. పిల్లలకు ఏవైనా తినే వస్తువులు, స్నాక్స్ ప్యాకెట్లు కొనిచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.