Sonu Sood Oxygen Plants : సోనూసూద్ ఆక్సిజన్.. దేశంలో ముందుగా ఏపీలోనే ప్రారంభం.. ఏయే జిల్లాల్లో అంటే..

ఆక్సిజన్ కోసం కరోనా రోగులు పడుతున్న బాధలు చూడలేక దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని రియల్ హీరో సోనూసూద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Sonu Sood Oxygen Plants : సోనూసూద్ ఆక్సిజన్.. దేశంలో ముందుగా ఏపీలోనే ప్రారంభం.. ఏయే జిల్లాల్లో అంటే..

Sonu Sood To Set Up His First Oxygen Plants In Andhra Pradesh

Sonu Sood Oxygen Plants In Ap : ఆక్సిజన్ కోసం కరోనా రోగులు పడుతున్న బాధలు చూడలేక దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని రియల్ హీరో సోనూసూద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ నుండి ఆక్సిజన్ ప్లాంట్లు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని అవసరమైన ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు. కాగా, ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ముందుగా ఏపీ నుంచే ప్రారంభించనున్నాడు సోనూసూద్. మొదటి రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు సోనూసూద్ ప్రణాళికను సిద్ధం చేశాడు.

సోనూసూద్ బృందం ఇప్పుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసే పనిలో ఉంది. తర్వాత నెల్లూరులో ఏర్పాటు చేయనుంది. దీనికోసం మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ఇతర సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులను కూడా పొందారు.

ఈ ప్లాంట్లు.. కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు వాటి పొరుగు గ్రామాల్లో ఉన్న వేలాది మంది కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ ను అందించనుంది. “సోను సూద్ మానవత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ ప్లాంట్ వల్ల ప్రతిరోజూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 150 నుండి 200 మంది కోవిడ్ రోగుల చికిత్సకు ఉపయోగపడుతుంది” అని కర్నూలు కలెక్టర్ జిల్లా అన్నారు.

”గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఆక్సిజన్ ప్లాంట్ చాలా అవసరం. ఈ ప్లాంట్స్ కోవిడ్-19తో ధైర్యంగా పోరాడటానికి సహాయపడతాయి. ఏపీ తర్వాత జూన్, జూలై మధ్య మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రస్తుతం, మేము వివిధ రాష్ట్రాల్లోని అత్యవసర సాయం అవసరమైన ఆసుపత్రులను గుర్తించాం” అని సోనూసూద్ తెలిపాడు.

సినిమాల్లో విలన్ గా నటించినా ప్రస్తుతం రియల్ హీరోగా, నేషన్ హీరోగా గుర్తింపు పొందాడు సోనూ సూద్. కరోనా కష్టకాలంలో అడిగిన వారికి కాదనకుండా, లేదనకుండా సాయం చేస్తున్నాడు. భారతీయుల హృదయాల్లో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నాడు. పేదలు సోనూని దేవుడిలా
చూస్తున్నారు. కరోనా పేరు ఎంతలా మార్మోగుతుందో.. సోనూ సూద్ పేరు కూడా మనదేశంలో అంతే హైలైట్ అవుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎందరో బాధితులకు సోనూసూద్ అండగా నిలిచాడు. బెడ్లు, ఆక్సిజన్, ఔషధాలు.. ఇలా.. ఏది అడిగితే అవన్నీ సమకూర్చాడు. ఆక్సిజన్ కోసం కరోనా రోగులు పడుతున్న బాధలు చూడలేక స్వయంగా రంగంలోకి దిగాడు. కరోనాపై పోరాటంలో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించాడు. దీంతో సోనూ క్రేజ్ మరింత పెరిగింది. ప్రభుత్వాలు కూడా చేయలేని పని సోనూ చేయడాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. కొందరు ఏకంగా సోనూని దేశానికి కాబోయే ప్రధాని అని కూడా కీర్తిస్తున్నారు.