Tirupati Rains : తిరుపతిలో కుండపోత, ఆకాశంలో విమానాల చక్కర్లు..నీట మునిగిన బస్టాండు

దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Tirupati Rains : తిరుపతిలో కుండపోత, ఆకాశంలో విమానాల చక్కర్లు..నీట మునిగిన బస్టాండు

Tpt

Tirupati Rains : మళ్లీ తిరుపతిలో కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. 2021, నవంబర్ 18వ తేదీ గురువారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని కూడళ్లు చెరువులను తలపిస్తున్నాయి. తిరుపతితో పాటు జిల్లాలోని తూర్పు మండలాలైన శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కెవిబిపురం, వరదయ్యపాలెం, సత్యవేడు, నారాయణపురం, బిఎన్. కండ్రిగ రేణిగుంట తదితర మండలాల్లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది.

Read More : CM Kcr Warning : వడ్లను తీసుకోవాల్సిందే..లేకపోతే బీజేపీ ఆఫీసుపై కుమ్మరిస్తాం – సీఎం కేసీఆర్ హెచ్చరిక

వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు వర్షానికి తడుస్తూ..సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక తిరుమల కొండపై కూడా భారీ వర్షం పడింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని గ్రహించి టీటీడీ..కాలినడక మార్గం క్లోజ్ చేసింది. ఘాట్ రోడ్ లో కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు తిరుపతి బస్టాండ్ నీట మునిగింది. వర్షాల కారణంగా పలు బస్సులు బస్టాండ్ కే పరిమితమయ్యాయి.  పరిమిత సంఖ్యలోనే బస్సులు తిరుగుతున్నాయి. బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఓ వైపు నీరు, మరోవైపు..బస్సులు లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read More : Rashi Khanna: కరణ్ జోహార్ బ్యానర్‌లో రాశీ.. బంపర్ అఫర్ కొట్టేసినట్లే

భారీ వర్షం కారణంగా…రేణిగుంట ఆంతర్జాతీయ విమానాశ్రయానికి పలు సమస్యలు ఎదురవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా గాల్లో ఓ గంట పాటు విమానాలు చక్కర్లు కొట్టాయి. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 1.30 గంటలకు ల్యాండ్ కావాల్సిన ఎయిర్ ఇండియా విమానం A1542(A321) ఆకాశంలో చక్కర్లు కొట్టి హైదరాబాద్ కు ప్రయాణం అయ్యింది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 1.40 గంటకు తిరుపతి చేరుకోవాల్సిన ఇండిగో విమానం 6E2005(A22N) కూడా చక్కర్లు కొట్టి బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యింది. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకోవాల్సిన స్పైస్ నెట్ విమానం SG 4050(DH8D) ల్యాండింగ్ ఆర్డర్ కోసం ఎదురు చూపులు చూసి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యింది. సాయంత్రం 6.35 నిమిషాలకు పూణే నుండి తిరుపతి రావాల్సిన స్పైస్ జెట్ విమానం SG 5052,(DH7D) మరియు 7.25 నిమిషాలకు హైదరాబాదు నుండి తిరుపతికి రావలసిన ఇండిగో విమానం 6E5217(A20N) కూడా రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read More : Nellore TDP : చెప్పినట్లే చేశాడు, అరగుండు, అరమీసం గీయించుకున్న టీడీపీ లీడర్!

మరోవైపు…ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర అండమాన్‌లో తీరంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ దిశగా కదులుతోంది. 2021, నవంబర్ 18వ తేదీ గురువారం నైరుతి బంగాళాఖాతంలో  దక్షిణ ఆంధ్రప్రదేశ్‌- ఉత్తర తమిళనాడు తీరానికి చేరే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోస్తా, రాయలసీమలోని చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

Read More : Paddy Procurement : కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్, దేశం కోసం పోరాడుతాం

అల్పపీడన ప్రభావంతో తీరం వెంబండి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణశాఖ ప్రకటించింది.  మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.  లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా జల్లులు పడుతున్నాయి. దీంతో రైతులకు కంటిమీద కునుకు కరవైంది. రాజధాని అమరావతి ప్రాంతంలో భారీ వర్షం హడలెత్తించింది. గుంటూరు జిల్లా తుళ్లూరులో అత్యధికంగా 7 సెంటీమీటర్లు,  అనంతపురం జిల్లా రొద్దాంలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం, విశాఖపట్నం, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు మండలాల్లో వర్షం కురిసింది .