Sudha Narayana Murthy : పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రిని పరిశీలించిన శ్రీమతి సుధ నారాయణ మూర్తి

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎక్కడి వారికైనా ఉచితంగా సర్జరీలు చేస్తున్నామని.... ఇదీ భారత దేశం గొప్పదనమని శ్రీమతి సుధ నారాయణ మూర్తి  అన్నారు. 

Sudha Narayana Murthy : పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రిని పరిశీలించిన శ్రీమతి సుధ నారాయణ మూర్తి

Sudha Narayana Murthy :  శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎక్కడి వారికైనా ఉచితంగా సర్జరీలు చేస్తున్నామని…. ఇదీ భారత దేశం గొప్పదనమని శ్రీమతి సుధ నారాయణ మూర్తి  అన్నారు.   టీటీడీ నిర్వహణ‌లోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం‌ను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యురాలు శ్రీమతి సుధనారాయణమూర్తి నిన్న సందర్శించారు.

ఆసుపత్రి లోని ఐసియు, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను చూశారు. పిల్లల గుండె ఆపరేషన్ కోసం వచ్చిన బంగ్లాదేశ్, కోల్‌కతా ప్రాంతాలకు చెందిన వారితో ఆమె మాట్లాడారు. ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ఆమె టీటీడీ అధికారులను అభినందించారు. డాక్టర్లు,సిబ్బంది నిబద్ధతతో వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఆసుపత్రి కార్పొరేట్ స్థాయి కంటే బాగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

కాగా… బంగ్లాదేశ్ రాజధాని డాఖా కు చెందిన మహమ్మద్ అబుల్ కసన్ అనే వ్యక్తితో ఆమె మాట్లాడారు. ఐదేళ్ల తన కూతురు ఫహీబాకు గుండెలో రంధ్రం ఏర్పడి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందని అబుల్ కసన్   చెప్పారు. గూగుల్ లో ఉచితంగా గుండె ఆపరేషన్ చేసే చిన్న పిల్లల ఆసుపత్రి కోసం వెదికానని, తిరుపతిలో ఇలాంటి ఆసుపత్రి ఉందని ఇక్కడ వైద్య సేవలు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలుసుకుని ఇక్కడకు వచ్చామని శ్రీమతి సుధ నారాయణ మూర్తికి చెప్పారు.

మెయిల్ ద్వారా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డిని సంప్రదించానన్నారు. పాప మెడికల్ రికార్డులన్నీ ఆయనకు పంపానని, వాటిని పరిశీలించి ఆపరేషన్ చేస్తామని జూలై 24న ఆసుపత్రికి రావాలని పిలిచారన్నారు. జూలై 24వ తేదీ ఆసుపత్రికి వచ్చి అపాయింట్ మెంట్ తీసుకున్నామని, 29 వ తేదీ రూపాయి ఖర్చు లేకుండా పాపకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేశారని ఆయన వివరించారు. డాక్టర్లు ,సిబ్బంది చాలా మంచి సేవలు అందిస్తున్నారని కసన్ చెప్పారు.

ఆసుపత్రి ప్రారంభించిన ఆరు నెలల్లోనే 500 కు పైగా గుండె ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించామని, వారం రోజుల వయసున్న పిల్లలకు కూడా విజయవంతంగా గుండె ఆపరేషన్లు చేశామని టీటీడీ ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి శ్రీమతి సుధ నారాయణ మూర్తికి వివరించారు. త్వరలోనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.  రూ.20 నుంచి 25 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్లు ఉచితంగా చేస్తామన్నారు. ఇందుకోసం కొన్ని యంత్రాలు అవసరమవుతాయని వాటిని సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నామని శ్రీ ధర్మారెడ్డి వివరించారు.