మందులోళ్ల మాయాజాలం, విశాఖ ఫార్మా సెజ్‌ సేఫేనా ?

  • Published By: madhu ,Published On : November 5, 2020 / 01:44 PM IST
మందులోళ్ల మాయాజాలం, విశాఖ ఫార్మా సెజ్‌ సేఫేనా ?

Special Story On Pharma Industries In AP : విశాఖలో మందులోళ్లు మాయాజాలం సృష్టిస్తున్నారు. ఫార్మా సెజ్‌లో కొత్త ఫార్మా కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేసేస్తున్నారు. ఇప్పటికే వందల ఎకరాల్లో ఉన్న హెటిరో వంటి కంపెనీలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఎల్జీ పాలిమార్ ప్రమాదం మరచిపోక ముందే రాంకీ ఫార్మాసిటీలోని సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌లో నాలుగు నెలల క్రితం విషవాయువు లీకై ఇద్దరు ఉద్యోగులు మరణించారు. అంతకుముందు కూడా అదే కంపెనీలో ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారు.



ఈ కేసును సుమోటోగా విచారణ చేపట్టిన నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్పష్టం చేసింది.
నాలుగు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో.. సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ యాజమాన్యంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందంటోంది ఎన్‌జీటీ. రసాయనాలు పంపేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని.. అంతేకాకుండా అనుమతి లేకుండా బెంజి మెడజోల్‌ అనే మందును తయారుచేస్తున్నట్టు తెలిపింది.



అదే ప్రమాదానికి కారణమని వెల్లడించింది. ఆ విషవాయువు బయటకు రావడం వల్ల పర్యావరణం దెబ్బతిందని, దానికి కంపెనీ 24 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇటీవల కాలంలో ఎన్‌జీటీ ఇంత భారీగా జరిమానా విధించడం ఇదే మొదటిసారి. ఈ విషయం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎప్పుడూ భద్రత, ప్రమాణాల గురించే చర్చిస్తున్నామని, అనుమతి లేని మందుల తయారీ కూడా జరుగుతున్నదంటే.. ఆ దిశగా కూడా దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.



https://10tv.in/no-manufacturing-industry-to-be-allowed-in-new-industrial-areas-of-delhi/
సాయినార్‌ విషయంలో ఎన్‌జీటీ అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ కంపెనీని ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేసి, అన్నీ సక్రమంగా ఉన్నాయని సర్టిఫై చేశాకే విద్యుత్‌ కనెక్షన్‌ పునరుద్ధరించాలని సూచించింది. ఇది కొత్త విషయం. ప్రమాదాలు జరిగితే విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని ఇంతవరకు ఏ అధికారి ఇప్పటివరకు EPDCLని ఆదేశించలేదు.



జూన్‌ 29న ప్రమాదం జరిగినప్పుడు దానిని ఒకేసారి మూసివేయడానికి కుదరదని, దశల వారీగా షట్‌డౌన్‌ చేస్తామని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కంపెనీల సిబ్బంది, అక్కడ ఎలాంటి మందులు తయారు చేస్తున్నారో చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎన్జీసీ స్పష్టం చేసింది



ఎన్జీటీ తాజా ఆదేశాలతో.. విశాఖ ఫార్మా సెజ్‌ సేఫేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్కు నగరంలో ఫార్మా కంపెనీలు పెరిగిపోతుండగా.. విశాఖ వాసులకు భద్రతపై భరోసా లేకుండా పోతోంది. కంపెనీల సిబ్బంది నైపుణ్యం.. అనుమతుల మేరకే మందులు తయారు చేస్తున్నారా అనే ప్రశ్నలు.. సమాధానాలు లేకుండానే మిగిలిపోతున్నాయి. అధికారులు ఇప్పటికైనా ఎన్జీటీ ఆదేశాలను పాటిస్తారో లేదో చూడాలి మరి…