అర్చకుడికి కరోనా..ముక్కంటీశ్వరుడి దర్శనం ఎప్పుడో

  • Published By: madhu ,Published On : June 10, 2020 / 03:57 AM IST
అర్చకుడికి కరోనా..ముక్కంటీశ్వరుడి దర్శనం ఎప్పుడో

శ్రీకాళహస్తి ఆలయంలో దర్శనానికి మరోసారి బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ ఓపెన్ అయిన తరుణంలో ఈనెల 12నుంచి ముక్కంటీశ్వరుడి దర్శనభాగ్యం కల్పించాలనుకున్న ఆలయ అధికారులకు మరో అవాంతరం ఎదురయ్యింది. దేవాలయంలో పనిచేసే ఓ అర్చకుడు కరోనా బారినపడటం కలకలం రేపింది.

దీంతో  భక్తులను ఆలయంలోకి అనుమతించాలన్న నిర్ణయం వాయిదా పడింది. మొత్తం 71 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఒకరికి పాజిటివ్ వచ్చింది. మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు… ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు భక్తులను అనుమతించబోమని ఆలయ అధికారులు తెలిపారు.

సాధారణంగా గ్రహణ సమయాల్లో దేశంలోని ఆలయాలన్నీ మూతపడ్డా.. ఈ ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి రివర్స్‌ అయ్యింది. సోమవారం నుంచి దేశంలోని ఆలయాల తలుపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆలయం మాత్రం ఓపెన్‌ కావడం లేదు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీ ముక్కంటీశ్వరుడి దర్శనానికి మరికొన్ని రోజుల సమయం పట్టనుంది.

స్వామి వారి దర్శనానికి భక్తులు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ఇప్పట్లో భక్తులకు ఆ పరమేశ్వరుని దర్శన భాగ్యం దక్కబోవడం లేదు. శ్రీకాళహస్తి రెడ్‌జోన్‌ పరిధిలో ఉండటం వల్ల.. ఆలయంలోకి భక్తులకు ఎంట్రీ లేదని అధికారులు చెబుతున్నారు.
నెలన్నర రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాళహస్తి వార్తాలకెక్కింది.

పెద్ద సంఖ్యలో అక్కడ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన ఓ యువకుడికి కరోనా సోకడంతో మొదలైన కేసుల సంఖ్య.. క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. శ్రీకాళహస్తి పేరు చెబితేనే చిత్తూరు జిల్లా ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. ఒక దశలో శ్రీకాళహస్తిలో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్‌ కూడా జరిగింది.  రెవెన్యూ, మున్సిపల్, పోలీస్‌ సిబ్బంది మొదలు.. సామాన్యుల వరకు అంతా కరోనా బారినపడ్డారు.

దీంతో శ్రీకాళహస్తి పట్టణం మొత్తాన్ని అధికారులు నెల రోజులకుపైగా దిగ్బంధించారు. అత్యంత కఠిన ఆంక్షలు అమలు చేశారు. శ్రీకాహళస్తిలో రెడ్‌జోన్‌ సడలించే అవకాశమే కనిపించడం లేదు. కంటైన్మెంట్‌, రెడ్‌ జోన్లలో గల ఆలయాల్లోకి భక్తుల ప్రవేశాన్ని కేంద్రం నిషేధించడంతో… ముక్కంటి ఆలయంలో పరమేశ్వరుడి దర్శనానికి భక్తులకు అవకాశం లేకుండా పోయింది.

దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ముక్కంటి ఆలయంలో భక్తుల దర్శనం కోసం అధికారులు ఇది వరకే అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ప్రత్యేక మార్కింగ్‌ చేశారు. కనీసం ఐదు నుంచి ఆరు అడుగుల దూరం ఉండేలా వృత్తాలు గీశారు. భక్తులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

రాహు కేతు పూజల విషయంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరికి కేంద్రం కూడా ఆలయాల్లో దర్శనానికి భక్తులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కానీ రెడ్‌జోన్‌ పరిధిలోని శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి మాత్రం భక్తులు నోచుకోలేదు. అధికారులు టెంపుల్లోకి భక్తులకు నో ఎంట్రీ నిర్ణయం తీసుకోవడంతో… స్వామివారి దర్శనానికి మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.