Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు

శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులో వరదనీరు వచ్చి చేరుతుంది. నాలుగు లక్షల క్యూసెక్కువ వరద నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

10TV Telugu News

Srisailam Project : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద నీరు కృష్ణా, తుంగభద్ర నదుల్లో చేరుతుంది. ఈ నదులపై ఉన్న ప్రాజెక్టులు దాదాపు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రత్యేకమైన శ్రీశైలం ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్ట్ దాదాపు గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మొత్తం 215 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం గల శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 175 టీఎంసీలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రాజెక్టులోకి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. మరికొద్ది రోజులపాటు ఇదే విధంగా వరద కొనసాగే అవకాశం ఉండటంతో ప్రాజెక్టులోని పది గేట్లను 10 అడుగుల మేరఎత్తి మూడు లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.

కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక, శ్రీశైలం డ్యామ్‌ నుంచి నాగార్జునసాగర్‌ వైపు పరుగులు పెడుతోంది కృష్ణమ్మ. మరోవైపు ఏపీ ప్రభుత్వం కోరినట్లుగా రైట్ పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి కోసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఇచ్చింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అధికారులు. డ్యాం నిండే అవకాశం ఉండటంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తితో పాటు పోతిరెడ్డిపాడు ద్వారా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు.

10TV Telugu News