విశాఖకు స్టీల్‌ప్లాంట్‌ గుండె వంటిది.. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడింది : చంద్రబాబు

విశాఖకు స్టీల్‌ప్లాంట్‌ గుండె వంటిది.. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడింది : చంద్రబాబు

Vishakha Steel plant : విశాఖకు స్టీల్‌ప్లాంట్‌ గుండె వంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. 32 మంది ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పడిందని తెలిపారు. తెలుగు వారంతా విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పోరాడారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి శ్రీనివాస్‌ దీక్ష ఊపిరినిచ్చిందన్నారు. విశాఖ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తోందని విమర్శించారు.

విశాఖ ఆత్మను దోచుకోవాలనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ మీకు తెలియదా అని నిలదీశారు. ఏపీకి ఆర్థిక రాజధాని ఎప్పటికీ విశాఖనేనని స్పష్టం చేశారు. విశాఖలో భూ కబ్జాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పాదయాత్ర పేరుతో విజయసాయిరెడ్డిది రాజకీయ డ్రామా అని విమర్శించారు. ఎవరికి కావాలి మీ పాదయాత్ర అని..విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చేశారు.

అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆమరణ దీక్షకు దిగిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ దీక్షను విరమించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను చంద్రబాబు పరామర్శించారు. దీక్ష విరమించాలని కోరుతూ.. నిమ్మరసం ఇచ్చారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కలిసి పోరాడుదామని చంద్రబాబు సూచించారు.

మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పొలిటికల్ వార్ ముదురుతోంది. ప్రైవేటీకరణను రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు పొలిటికల్‌ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు ప్రైవేటీకరణ ఆపుతామంటూ కేంద్రం పెద్దలను కలుస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు.. నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రైవేటీకరణను ఆపేందుకు అవసరమైతే పదవుల త్యాగానికైనా సిద్ధమని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాజీనామాలకు వైసీపీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.