ఏలూరులో వింత వ్యాధి : రిపోర్ట్‌లపై ఉత్కంఠ, ఇద్దరి మృతికి కారణం వేరే

ఏలూరులో వింత వ్యాధి :  రిపోర్ట్‌లపై ఉత్కంఠ, ఇద్దరి మృతికి కారణం వేరే

Strange Disease In Eluru Suspense On Reports

Strange disease in Eluru : అంతుచిక్కని అనారోగ్యం.. ఏలూరు ప్రజలను ఇంకా వేధిస్తోంది. ఇప్పటికే వందల మంది బాధితులు ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చేరి.. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు వచ్చిన బాధితుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతులు సుబ్బరావమ్మ, అప్పారావు వింత వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చేరినప్పటికీ.. వాళ్లు చనిపోవడానికి అసలు కారణం వేరే ఉందని వైద్యులు చెబుతున్నారు. సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఇద్దరి మరణంతో ఏలూరు వింత వ్యాధి కారణంగా చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.



వింత వ్యాధి బారినపడ్డ బాధితుల సంఖ్య 609కి చేరింది. ఇప్పటివరకు 543 మంది రోగులను డిశ్చార్జ్‌ చేయగా.. ప్రస్తుతం 32 మంది ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో 33 మంది గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. మరోవైపు ఏలూరు వింత వ్యాధికి కచ్చితమైన కారణాలను కనుక్కునేందుకు కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రధానంగా తాగునీటి వల్ల అస్వస్థత వచ్చిందా.. లేదా? అనే విషయంపై దృష్టి సారిస్తున్నారు.



కలకలం సృష్టిస్తున్న ఏలూరు వింత వ్యాధికి ఇంతవరకూ కారణాలు తెలియడం లేదు. దీంతో.. వింత వ్యాధిపై ఎయిమ్స్ వైద్యులు మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. బాధితుల నుంచి మరిన్ని రక్త నమూనాలను సేకరించి.. వాటిని ఢిల్లీ ఎయిమ్స్ విశ్లేషిస్తోంది. మొత్తం 37 రక్త నమూనాల పరీక్షించగా.. 21 నమూనాల్లో అధిక మోతాదులో లెడ్.. మిగతా నమూనాల్లోనూ లెడ్‌, నికెల్ వంటి భారలోహాలు ఉన్నట్లు తేలింది.



భార లోహాలతో పాటు ఆర్గానోక్లోరిన్స్ కూడా ఉండొచ్చని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్గానోక్లోరిన్స్ పరీక్షల కోసం శాంపిల్స్‌ను పరీక్షించేందుకు.. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సహాయం కోరారు ఎయిమ్స్ వైద్యులు. దీనిపై స్పందించిన CFSL హోంశాఖ నుంచి రాతపూర్వకంగా ఆదేశాలు కావాలని కోరింది. ఎంపీ జీవీఎల్ నరసింహారావు చొరవతో రాతపూర్వక ఉత్తర్వులు CFSLకు అందాయి. దీంతో ఆర్గానో క్లోరిన్స్ ఆనవాళ్ల కోసం CFSL పరిశోధనలు మొదలు పెట్టింది. 2020, డిసెంబర్ 11వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం వరకు పరీక్ష ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.



ఇక వింత వ్యాధి మూలాల నిర్ధారణకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది ఏపీ సర్కార్‌. వ్యాధి నివారణ చర్యలపై అధ్యయనం, సిఫార్సుల కోసం మల్టీడిసిప్లీనరీ కమిటీ పనిచేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన 21 మంది అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఎయిమ్స్‌, ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్‌ఐఎన్‌, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉంటారు. వీరు ఏలూరులో తలెత్తిన పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు.