కరోనా స్ట్రెయిన్ : యూకే నుంచి వచ్చిన వారి కోసం నెల్లూరు జిల్లాలో వేట

కరోనా స్ట్రెయిన్ : యూకే నుంచి వచ్చిన వారి కోసం నెల్లూరు జిల్లాలో వేట

Super-spreading’ Covid Strain Horror in Nellore district :  ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో వణికిస్తోందో అందరికీ తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించి ప్రజలను భయపెట్టింది. దీన్ని నియంత్రించడం కోసం చాలా దేశాలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో పడ్డాయి. రేపో మాపో వ్యాక్సిన్ ప్రజలకు అందిస్తారని అనుకునే లోపు….బ్రిటన్ నుంచి మరో పిడుగు లాంటి వార్త ప్రజలను భయకంపితులను చేస్తోంది. యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగు చూడటం కలవరపరుస్తోంది.

ఈ కొత్త కరోనా ఇంతకు ముందు కంటే చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆందోళన చెందిన ప్రపంచ దేశాలు… యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. వీటిలో మన దేశం కూడా ఒకటి. ఆ దేశం నుంచి ఇటీవల కాలంలో దేశానికి తిరిగొచ్చిన వారందరికీ, కరోనా టెస్టులు నిర్వహించాలని భారత్ కూడా నిర్ణయించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు యూకే నుంచి వచ్చిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీకి వచ్చిన వారిలో నెల్లూరు జిల్లాకూ చెందిన వార ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది.

10 రోజుల కిందట లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడు, అతని తల్లికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. గతంలో కూడా ఏపీ లో కరోనా విజృంభించిన సమయంలో మొట్ట మొదటగా నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడకే కరోనా సోకిన విషయం తెలిసిందే. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నెల్లూరుకు దగ్గరగా ఉండటంతో యూకే నుంచి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.

నెల్లూరులో 24 గంటల హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. యూకే నుంచి ఇక్కడ కు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానిత లక్షణాలు ఉన్నా అధికారులు వారిని వెంటనే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇప్పటికే యూకె నుంచి వచ్చిన 46 మందిని గుర్తించిన అధికారులు వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను కూడా గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటివరకు ఒకరికి మాత్రమే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ ల వారికి కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా పరీక్షలు చేయిస్తున్నారు.