లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ – పిటీషన్లు కొట్టివేత

Updated On - 2:43 pm, Mon, 25 January 21

supreme court green signal for ap local body elections : ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలు యధావిధిగా జరిపించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటీషన్లను ధర్మాసనం కొట్టి వేసింది.

స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్‌ను జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఇవాళ విచారించింది. ఈ బెంచ్‌లో జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌ కూడా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గి వాదించారు.

విచారణ సందర్భంగా జస్టిస్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం – ఉద్యోగులు పనిచేయకుండా పిటిషన్ వేయడం ప్రమాదకరమన్నారు. ఉద్యోగుల ప్రవర్తన పూర్తి అసంతృప్తిగా ఉందని వ్యాఖ్యానించింది.

ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని, కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికలు ప్రతీసారి వాయిదా పడుతున్నాయని జస్టిస్‌ కౌల్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేశారని రోహత్గి కోర్టుకు విన్నవించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. పోలీసులు వ్యాక్సిన్ భద్రతలో ఉన్నారని వివరించారు.

రాష్ట్ర హైకోర్టు సింగిల్‌ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని రోహత్గి తెలిపారు. వ్యాక్సినేషన్‌ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు.

కాగా …ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శిరోధార్యంగా భావించాలని…ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు.