స్విమ్స్‌ ఆస్పత్రి ప్రమాద ఘటన.. రాధిక కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం ప్రకటించిన జగన్ ప్రభుత్వం

  • Published By: naveen ,Published On : October 5, 2020 / 01:30 PM IST
స్విమ్స్‌ ఆస్పత్రి ప్రమాద ఘటన.. రాధిక కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం ప్రకటించిన జగన్ ప్రభుత్వం

svims covid hospital incident: చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్‌ పద్మావతి కోవిడ్ ఆస్పత్రి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికి జగన్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రాధిక కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం ప్రకటించింది. గాయపడిన ఇద్దరికి రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రి ఆళ్లనాని తెలిపారు. కాగా, రాధిక కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని తక్షణ సాయంగా ఇవ్వనున్నట్లు స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ తెలిపారు. గాయపడ్డ ఇద్దరికి 50 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. మృతురాలు రాధిక కుటుంబానికి అండగా ఉంటామని వెంగమ్మ అన్నారు.

స్విమ్స్‌ పద్మావతి కోవిడ్ ఆస్పత్రి మూడవ అంతస్తు గోడ కూలి పడటంతో… నర్సింగ్ అటెండెంట్ రాధిక మృతి చెందింది. మరో ఇద్దరు కరోనా బాధితులు గాయపడ్డారు. నాలుగు నెలల క్రితమే రాధిక ఉద్యోగంలో చేరింది. ఇప్పుడు అర్ధాంతరంగా చనిపోవడం విషాదాన్ని నింపింది.

రాధిక జీవితంలో అన్నీ విషాదాలే. మూడేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు డెంగ్యూతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం మూడు నెలల గర్భిణి అయిన రాధిక బిల్డింగ్‌పైన ఉన్న పిట్టగోడ కూలి మృతిచెందింది. ఆస్పత్రి బిల్డింగ్‌ నిర్మాణం పూర్తయి ఏడాదే అవుతోంది. గోడ కూలి పడటంపై స్థానికులు మండిపడుతున్నారు.

రాధిక కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలి:
తిరుపతి స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రి గోడ కూలి మృతిచెందిన రాధిక కుటుంబాన్ని ఆదుకోవాలని సిబ్బంది ఆందోళన చేపట్టింది. వీరి ఆందోళనకు బీజేపీ మద్దతు తెలిపింది. రాధిక కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. అటు ఆస్పత్రి ప్రమాద ఘటనపై ఏపీ సర్కార్‌ సీరియస్‌ అయ్యింది.

ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు. రాధిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి ప్రకటించారు. ప్రమాద కారణాలపై నివేదిక ఇవ్వాలని ఇంజినీర్లను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ప్రమాద ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

మృతురాలు రాధిక కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ తెలిపారు. తక్షణ సాయంగా 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. గాయపడ్డ ఇద్దరికి 50 వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. రాధిక భర్తకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని వెంగమ్మ హామీ ఇచ్చారు.