కామ పిశాచి : తూర్పుగోదావరి స్వాధార్ గృహంలో వార్డెన్ కీచకపర్వం

  • Published By: madhu ,Published On : May 20, 2020 / 01:35 AM IST
కామ పిశాచి : తూర్పుగోదావరి స్వాధార్ గృహంలో వార్డెన్ కీచకపర్వం

కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు.. ఆశ్రయం కోసం వచ్చినవారిని ఆటబొమ్మలుగా మార్చేశాడు.. ఒక్కరా.. ఇద్దరా ఏకంగా నలుగురిపై కన్నేశాడు.. వారిపట్ల పశువులా ప్రవర్తించాడు.. బలహీనతలను ఆసరాగా తీసుకుని అఘాయిత్యాలకు పాల్పడ్డాడు.. అంతటితో ఆగకుండా వ్యభిచారం కూడా చేయించాడు. రాజమహేంద్రరం సమీపంలోని స్వాధార్‌ గృహాన్ని వ్యభిచార గృహంగా మార్చేశాడు. చివరికి యువతుల ఫిర్యాదుతో కటకటాలపాలయ్యి.. ఊచలు లెక్కిస్తున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులోని ప్రభుత్వ స్వాధార్ గృహం. ఈ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌కు రెడ్డిబాబు అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా వసతి గృహంలో కొంతమంది యువతులు అక్కడే ఉండిపోయారు. ఈ హాస్టల్‌ ఉండే మహిళలు, యువతులపై కన్నేశాడు. ఒకరుకాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఒకరికి తెలియకుండా ఒకరిపై అత్యచారానికి పాల్పడ్డాడు. 

రెడ్డిబాబు అంతటితో ఆగలేదు. ఆ యువతులను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చేవాడు. అందుకు వారు అంగీకరించకపోవడంతో వారిని నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. అయినా వారు ఒప్పుకోకపోవడంతో వారిపై బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. వాచ్‌మెన్‌ రెడ్డిబాబు వేధింపులు ఎక్కువవ్వడంతో ఆ యువతులు వార్డెన్‌ అరుణకు ఫిర్యాదు చేశారు. వార్డెన్‌ కూడా కామాంధుడికే వత్తాసు పలకడంతో…. రెడ్డిబాబు మరింతగా రెచ్చిపోయాడు. తన బంధువులు, స్నేహితులను తీసుకొచ్చి ఆ యువతులను వారి వద్దకు బలవంతంగా పంపేవాడు. అందుకు ఒప్పుకోకుంటే చిత్రహింసలకు గురిచేసేవాడు. యువతులతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తూ… స్వాధార్‌ గృహాన్ని వ్యభిచార కూపంగా మార్చేశాడు.

 ఇటీవల హాస్టల్ వార్డెన్ అరుణ సెలవుపై వెళ్లడంతో ఆమె స్థానంలో ఇన్‌ఛార్జ్‌ వార్డెన్‌గా ఇందిరా నియమితులయ్యారు. ఆశ్రయంలో ఉన్న యువతులకు కౌన్సిలింగ్‌ ఇచ్చే క్రమంలో బాధితులు ఆమె దగ్గర తమ గోడువెల్లబోసుకున్నారు. వాచ్‌మెన్‌ వేధింపుల గురించి వివరించడంతో రెడ్డిబాబు కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. వాచ్‌మెన్‌ అరాచకాలు విన్న ఆ అధికారి షాక్‌కు గురైంది. ధవళేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  రెడ్డిబాబును అరెస్ట్‌ చేశారు. స్వాధార్ గృహం కీచకపర్వంపై సమాచారం అందుకున్న వైసీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, స్థానిక వైసీపీ నేతలు బాధితులను పరామర్శించారు. జిల్లా మానసిక వైద్య బృందానికి చెందిన సైకాలజిస్ట్ ద్వారా బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

మహిళలకు రక్షణగా ఉండాల్సిన స్వాధార్ గృహంలో ఇటువంటి దారుణం జరగడం ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మొత్తం వ్యవహారంలో వార్డెన్‌ అరుణ పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరుణ కూడా తమను కొట్టేదని బాధితులు ఆరోపిస్తుండడం దీనికి బలం చేకూర్చుతుంది. అరుణ, రెడ్డిబాబు ఇద్దరూ కలిసే వేధించినట్టు బాధితులు ఆరోపిస్తుండడంపైన పోలీసులు విచారణ చేస్తున్నారు.

స్వాధార్‌ గృహంలో…వివిధ కారణాలతో కుటుంబ సభ్యులకు దూరమైన యువతులు , మహిళలు ఆశ్రయం పొందుతారు. మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించడంతోపాటు.. ఉపాధికి అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు.

Read: ఏసీ లేకుండా పడుకోవాలన్న భర్త, ఆత్మహత్య చేసుకున్న భార్య