ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన టైలర్ పెళ్లాం

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన టైలర్ పెళ్లాం

tailor killed, by wife’s lover in srikakulam district : పెళ్లై ఏళ్లు గడుస్తున్నా ప్రియుడితో బంధాన్ని వదులుకోని ఇల్లాలు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పాతపట్నం గ్రామంలో మాలతి అనే యువతి తాతగారింటి వద్ద నివసిస్తూ ఉండేది.  ఆమె అదే గ్రామానికి చెందిన పెనుబాకల హేమసుందరరావుతో ప్రేమలో పడింది.  అయితే ఇద్దరివీ వేర్వేరు కులాలు కావటంతో ఇంట్లో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు.

కొన్నాళ్ళకు ఇరువురూ వారి వారి కులస్తులతో పెళ్లిళ్లు చేసుకుని, వేర్వేరు కుటుంబాలతో జీవనం కోసం హైదరాబాద్ చేరుకున్నారు.  మాలతి భర్త నల్లకేవటి కుమారస్వామి టైలర్ గా జీవనం సాగిస్తుండగా….  హేమసుందరరావు తాపీమేస్త్రీ గా పని చేస్తున్నాడు. ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో వివాహాలైనప్పటికీ ఇద్దరి మధ్య ప్రేమాయణం మాత్రం ఆగలేదు. హేమసుందరరావు అప్పుడప్పుడు మాలతితో  ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు.

భర్తకు తెలియకుండా మాలతి, హేమసుందరరావును కలుస్తూ ఉండేది. కొన్నాళ్లకు ఈ విషయం మాలతి భర్త కుమారస్వామికి తెలిసిపోయింది.  కుమారస్వామి భార్యను వివాహేతర సంబంధం మానుకోమని హెచ్చరించాడు. అయినా మాలతి హేమసుందరరావుతో   ప్రేమాయణం కొనసాగిస్తూనే ఉంది. విసుగు చెందిన కుమారస్వామి పెళ్లాం పిల్లలను తీసుకుని స్వగ్రామం   లోహరజోలకు  తిరిగి వచ్చేసాడు.

అయితే ఫోన్ లో మాలతి హేమసుందరరావుల ప్రేమయాణం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కుమారస్వామి తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భావించిన మాలతి భర్తను అడ్డు తొలగించు కోవాలనుకుంది. ఈ విషయాన్ని ప్రియుడు హేమసుందరరావుకు చెప్పింది. ఇద్దరూ కలిసి ప్లాన్ వేశారు.

జనవరి 25న పర్లాకిమిడిలో ఉన్న పెద్దమ్మ ఇంటికి వెళ్దామని కుమారస్వామికి చెప్పింది.  నిజమని నమ్మిన కుమారస్వామి ఇద్దరు పిల్లల్ని తీసుకుని ద్విచక్ర వాహానంపై బయలు దేరాడు. తామిద్దరం పర్లాకిమిడి   వెళుతున్న విషయాన్ని మాలతి హేమసుందరావుకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. మాలతి ఫ్రయాణం వివరాలు మినిట్ టూ మినిట్ హేమసుందరరావుకు చెప్తూ వచ్చింది.

హేమసుందరరావు  కూడా ఒక మైనర్ బాలుడ్ని వెంటబెట్టుకుని బైక్ పై అదే మార్గంలో వస్తూ కుమారస్వామి బైక్ రావటం గమనించాడు. అతనికి అనుమానం రాకుండా ఫాలో అవుతూ దిమ్మిడిజోల సమీపంలోకి వచ్చేసరికి కూమారస్వామి బైక్ కు తన బైక్ అడ్డంపెట్టి   కత్తులతో అతడ్ని పొడిచి పరారయ్యాడు.

కేసు నమోదు చేసుకున్న బత్తిలి పోలీసులు విచారణ చేపట్టారు.  మాలతి ఫోన్ స్వాధీనం చేసుకుని ఆమె కాల్ డేటా పరిశీలించారు. హత్య జరిగిన రోజు మాలతి ఫోన్ నుంచి ఎక్కువ కాల్స్ హేమసుందరరావు ఫోన్ కు వెళ్లటం గమనించారు. వారిద్దరి ప్రేమాయణం గురించి విచారణలో తెలుసుకున్నారు.

హేమసుందరరావును  అదుపులోకి తీసుకుని,  ఇద్దర్నీ తమదైన స్టైల్లో విచారించే సరికి నిజం ఒప్పుకున్నారు.  హత్యకు ఉపయోగించిన కత్తులను పాతపట్నంలో   కొనుగోలు చేసినట్లు నిందితుడు చెప్పాడు. హేమసుందరరావు  వెంట వచ్చిన మైనర్ బాలుడితో సహా ముగ్గురిని పోలీసులు కోర్టులో హజరు పరిచారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.