కాపులకు చేసిందంతా మేమే అంటోన్న టీడీపీ.. పవన్‌తో చర్చలకు సిద్ధం

కాపులకు చేసిందంతా మేమే అంటోన్న టీడీపీ.. పవన్‌తో చర్చలకు సిద్ధం

ఏపీ స‌ర్కార్ కాపు నేస్తం ప‌థకాన్ని ప్రవేశ‌పెట్టడంతో రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ ఆ వ‌ర్గానికి తామే ఎక్కువ చేశామంటూ వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. కాపుల‌కు అధికార‌, ప్రతిప‌క్షాలు అన్యాయం చేశాయని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌ వ్యాఖ్యానించడంతో ఈ అంశానికి మ‌రింత రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. కాపులకు తాము చేసిన‌ంత సంక్షేమం ఎవ‌రు చేశారో చ‌ర్చకు సిద్ధమంటూ టీడీపీ స‌వాళ్ళు విసురుతోంది.

ఈ అంశంపై ప్రజ‌ల్లో ఎంత చ‌ర్చ జ‌రిగితే అంత తమకే లాభం అనే రీతిలో ఉంది టీడీపీ. అధికార ప‌క్షం మాత్రం టీడీపీ కేటాయింపులు మాత్రమే చేసి చేతులు దులుపుకొందంటూ విమ‌ర్శలు వినిపిస్తోంది. ఆ రోజు టీడీపీ హ‌యాంలో ప్రశ్నించ‌ని జ‌న‌సేనాని పవన్‌ ఈ రోజు కాపు వ‌ర్గానికి న్యాయం చేస్తున్న తమపై విమ‌ర్శలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు దుయ్యబడుతున్నారు. కాపుల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేత‌ల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేశారు.

సీనియ‌ర్ నేత‌లు చినరాజ‌ప్ప, బొండా ఉమా, జ్యోతుల నెహ్రు, నిమ్మల రామానాయుడుల‌తో చంద్రబాబు క‌మిటీని వేసి ప్రజ‌ల‌కు వాస్తవాలు తెలియజేయాల‌ని ఆదేశించారు. 2014లో టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో ఆ వ‌ర్గానికి ఎలాంటి ప్రాధ్యాన్యం ఇచ్చామనేది వివరించాలని డిసైడ్‌ అయ్యారు. ఆ వ‌ర్గానికి రాజ‌కీయాల్లో ఇచ్చిన ప్రాధాన్యం, మంత్రివర్గంలో ఇచ్చిన స్థానం లాంటి అంశాలను బయటపెట్టాలని టీడీపీ నిర్ణయించుకుంది.

నామినేటెడ్ పదవుల్లో కాపులకు పెద్దపీట, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా ఎలా ఆదుకున్నదనే విషయాలతో పాటు కాపు కార్పొరేష‌న్‌కు కేటాయించిన నిధుల విషయాలను ప్రజ‌లకు తెలియ‌జేస్తే వాస్తవం ఏంటనేది ప్రజ‌లే నిర్ణయిస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా 5 శాతం రిజ‌ర్వేషన్లు ఆ వ‌ర్గానికి క‌ల్పించి చంద్రబాబు చారిత్రక నిర్ణయం తీసుకున్నారని టీడీపీ అంటోంది. కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి 2వేల కోట్ల రూపాయలు వారి సంక్షేమానికి ఖ‌ర్చు చేశామ‌ని చెబుతోంది.

కాపుల అంశంపై మాట్లాడే అర్హత జ‌గ‌న్‌కు లేద‌ని అంటోంది. కాపులకు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వడం సాధ్యం కాద‌న్న జ‌గ‌న్… ఇప్పుడు వారి సంక్షేమానికి పాటుప‌డ్డాం అంటే నమ్మేవారెవరూ లేరంటోంది. ఈ అంశంపై అధికార వైసీపీ గానీ, జనసేన పవన్‌ కల్యాణ్‌ గానీ తమతో చర్చకు వస్తే నిజానిజాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ సవాల్‌ చేస్తోంది. కాపు సామాజిక వర్గానికి ఎవరు ఏం చేశారో ప్రజల్లో చర్చ జరగాలి. ఈ చర్చ ద్వారా అయినా ఆ వర్గంలో కొంత మార్పు వస్తుందని, దానివల్ల తమకు లాభం జరుగుతుందని టీడీపీ భావిస్తోంది.

మరి ఇందుకు వైసీపీ సిద్ధపడుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. టీడీపీని టార్గెట్‌ చేస్తూ ప్రతివిమర్శలే చేస్తుందా చూడాల్సిందే. అసలు టీడీపీ భావిస్తున్నట్టుగా కాపు సామాజిక వర్గం ఆ పార్టీకి దగ్గరవుతుందా?