Chandrababu Naidu : దుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు.. బెజవాడ కనకదుర్గను దర్శించుకున్న టీడీపీ అధినేత

టీడీపీ అధినేత చంద్రబాబు దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దసరా రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు.

Chandrababu Naidu : దుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు.. బెజవాడ కనకదుర్గను దర్శించుకున్న టీడీపీ అధినేత

Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి ఉన్నారు. ఆలయ అర్చకులు చంద్రబాబుకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. దసరా రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు.

నాడు తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఇంద్రకీలాద్రి పై ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు చంద్రబాబు. పుష్కరాల సందర్భంగా ఘాట్‌రోడ్‌ను అభివృద్ధి చేశామని.. రూ.150 కోట్లతో ఇంద్రకీలాద్రిపై వసతులు కల్పించామని గుర్తుచేశారు. ఆ అభివృద్ధి పనులను కొనసాగించాలని వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు అందించాలన్నారు. రాష్ట్రాన్ని చల్లగా కాపాడమని అమ్మవారిని కోరానని చంద్రబాబు తెలిపారు. ఈరోజున పూజ చేసి ఏ కార్యక్రమం చేసినా ఫలిస్తుందన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అమరావతి అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. దుర్గమ్మ తల్లి సాక్షిగా రాజధానిగా అమరావతి ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని చంద్రబాబు గుర్తుచేశారు. వైసీపీ కూడా ఇదే చెప్పిందని.. అన్ని పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టి తెచ్చి..అమరావతి నిర్మాణం ప్రారంభించామన్నారు. రాజధాని ప్రజల సంకల్పమని.. దీనిపై రోజుకొక మాట మాట్లాడటం సరికాదని చంద్రబాబు హితవు పలికారు.

మాట తప్పడం మంచి పద్ధతి కాదని… అలాంటి వారిని అమ్మవారు ఉపేక్షించరని హెచ్చరించారు. నాడు అన్ని రాజకీయ పార్టీలు రాజధానిగా అమరావతికి ఆమోదం తెలిపాయని అన్నారు. వైసీపీ వాళ్ళు కూడా తాము ఇక్కడే ఇళ్లు కట్టుకున్నాము, ఇదే రాజధాని అని నాడు చెప్పలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

అమరావతిగా రాజధానికి ప్రజలందరి మద్దతు ఉందన్నారు. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి అంత దమ్ము ధైర్యం ఉంటే.. రాజీనామా చేసి.. మూడు రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు సవాల్ విసిరారు.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటనపై చంద్రబాబును మీడియా ప్రశ్నించగా.. ఆయన చిరు నవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ రాజ రాజేశ్వరి రూపంలో దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరి రోజు అవడం.. దానికి తోడు విజయదశమి పండుగ కావడంతో ప్రముఖులు సహా భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.