జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే, మళ్లీ సొంత గూటికి చేరాలని తహతహలాడుతున్న టీడీపీ నేత

  • Published By: naveen ,Published On : September 25, 2020 / 03:49 PM IST
జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే, మళ్లీ సొంత గూటికి చేరాలని తహతహలాడుతున్న టీడీపీ నేత

tdp leader muthumula ashok reddy.. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్న ఎం.అశోక్‌రెడ్డి కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడనే టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గిద్దలూరు నుంచి విజయం సాధించిన అశోక్‌రెడ్డి.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీలో చేరిపోయారు. ఆ పార్టీలో చురుకైన పాత్ర పోషించిన ఆయన.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో అడపాదడపా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు.

కానీ, గత ఆరు నెలలుగా నియోజకవర్గంలోని టీడీపీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదని అక్కడి తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. తమ సమష్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు.

జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్:
మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి వ్యవహార శైలిపై అనుమానమొచ్చిన తెలుగు తమ్ముళ్లు అసలు కారణం ఏంటనే విషయమై ఆరా తీశారట. జిల్లాలోని వైసీపీ కీలక నేత, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సత్సంబంధాలు ఉండడంతో అశోక్‌రెడ్డి ఆలోచనలన్నీ వైసీపీలో చేరడంపైనే ఉన్నాయని అంటున్నారు. అందుకే ఆయన టీడీపీలో సైలెంట్‌ అయిపోయారని చెబుతున్నారు. అధికార పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు.. జంప్ అయిపోదామని భావిస్తున్నారట. సమయం కోసం కళ్లలో వత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారని స్థానిక వైసీపీ వర్గాలు సైతం చెబుతున్నాయి.

వైసీపీ అభ్యర్థుల ఏకగ్రీవానికి సహకారం:
నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న అశోక్‌రెడ్డి లాక్ డౌన్‌కు ముందు జరిగిన స్థానిక ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థులను బలవంతంగా నచ్చజెప్పి, దగ్గరుండి పోటీలో నిలబడకుండా విత్‌డ్రా చేయించారట. వైసీపీ అభ్యర్థుల ఏకగ్రీవానికి సహకరించారని టాక్‌. బరిలో నిలిచే అభ్యర్ధులు సొంతంగా ఖర్చులు పెట్టుకోవాలని, పార్టీ కూడా అంత బలంగా లేదని, ఈ పరిస్థితుల్లో తాను కూడా ఎలాంటి సాయం చేయలేనని వారితో చెప్పి నిరుత్సాహపరిచారంటూ అశోక్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు.

అన్నా రాంబాబుని కాదని అశోక్‌ను తీసుకొస్తే పార్టీకే ఇబ్బంది:
వాస్తవానికి అధికార పార్టీలోని కీలక నాయకులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోవాలనే ఆలోచనలో అశోక్‌రెడ్డి ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని వీడి అప్పటి అధికార టీడీపీలో చేరడం పట్ల ఇప్పటికీ పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉందంట.

దీనికి తోడు స్థానిక నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు అశోక్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నా రాంబాబుని కాదని అశోక్‌ను తీసుకొస్తే పార్టీకే ఇబ్బంది అని స్థానికి వైసీపీ నేతలు అంటున్నారు. లేనిపోని తలనొప్పులు ఎందుకంటూ భావిస్తున్నారట.

ఇప్పుడు అశోక్‌రెడ్డిని చేర్చుకుంటే నియోజకవర్గంలో వర్గపోరు పెరిగే అవకాశాలుంటాయని హెచ్చరిస్తున్నారట. అందుకే అధిష్టానం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ.. అశోక్ రెడ్డి చేరికను అంశాన్ని పక్కన పెట్టినట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అశోక్‌ ఎంట్రీకి అవకాశం లేదని, అధిష్టానం హౌస్ ఫుల్ బోర్డ్‌ పెట్టేసిందని చెబుతున్నాయి.