కరెంటు ఛార్జీల పెంపు : జగన్ మాట తప్పారంటున్న కళా

  • Published By: madhu ,Published On : February 10, 2020 / 04:12 PM IST
కరెంటు ఛార్జీల పెంపు : జగన్ మాట తప్పారంటున్న కళా

ఏపీ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంపును ప్రతిపక్ష పార్టీ టీడీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ముందు ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేశారని నేతలు విమర్శలు చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత కళా వెంకట్రావు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…

విద్యుత్ ఛార్జీలు పెంచమని ఆనాడు జగన్ చెప్పి..ఈనాడు మాట తప్పారంటూ ఫైర్ అయ్యారు. ఛార్జీలు పెంచి 1.35 లక్షల మంది వినియోగదారులపై భారం మోపారని విమర్శించారు. టీడీపీ హాయంలో లోటును అధిగమించి…24 గంటల విద్యుత్ ఇచ్చామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి మిగులు విద్యుత్‌ను చేతిలో పెడితే…ఈ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు కళా.

సీఎం జగన్ అయిన తర్వాత ఒక్క యూనిట్ కూడా కరెంటును ఉత్పత్తి చేయలేదని దుయ్యబట్టారు. జే ట్యాక్స్ కోసం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. 9 వేల 500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉంటే…గ్రామాల్లో అప్రకటిత కరెంటు కోతలు ఎందుకు అని ప్రశ్నించారు కళా.  

* 500 యూనిట్లకు పైబడి వాడుతున్న వారికి ఈ పెంపు ఛార్జీలు వర్తిస్తాయి. 
* యూనిట్‌కు 90 పైసలు పెంచుతు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. 
* 500 యూనిట్లు దాటితే..ప్రతి యూనిట్‌కు రూ. 9.05 నుంచి రూ. 9.95కి పెరుగుతాయి. 

* మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1.35 లక్షల గృహాల వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుందని అంచనా. 
* చిన్న మధ్య తరహా పరిశ్రమలపై భారీగా ప్రభావం పడుతుందని తెలుస్తోంది. 
* ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ.