సైకిల్ దిగుతారా : మాగంటి బాబు దారెటు ?

సైకిల్ దిగుతారా : మాగంటి బాబు దారెటు ?

Tdp Leader Maganti Babu Likely Join Bjp

Tdp Leader Maganti Babu : పశ్చిమ గోదావరి జిల్లాలో మాగంటి బాబు అంటే తెలియని వారు ఉండరు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఓ ఇమేజ్‌ని సృష్టించుకున్న వ్యక్తి మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ మాగంటి బాబు. మాగంటి రవీంధ్రనాథ్‌ చౌదరి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మాగంటి బాబు.. ఏలూరు ఎంపీగా, మంత్రిగా , దెందులూరు ఎమ్మెల్యేగా పని చేశారు. 2009లో టీడీపీలో జాయిన్ అయ్యి ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

2014లో ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాల మీద మాగంటి బాబు దృష్టి పెట్టలేదు. ఎంపీగా ఎక్కువగా ఢిల్లీకే పరిమితం అయ్యారనే విమర్శలు ఉన్నాయి. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలసి గ్రూప్ రాజకీయాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ సమావేశాల్లో అయినా సీరియస్‌ను పక్కన పెట్టి కామెడీ చేయడంతో జిల్లా రాజకీయాల్లో పొలిటికల్ కమెడియన్‌గా మాగంటి బాబుకు ముద్రపడిందంటారు.

మాగంటి బాబు ఎంపీగా అధికారంలో ఉన్నప్పుడే తన వారసుడిని రాజకీయ రంగప్రవేశం చేయించారు. తన కొడుకు రాంజీని జిల్లా తెలుగు యువత అధ్యక్షుణ్ణి చేసి నారా లోకేశ్‌కి చేరువ చేశారు. పార్టీ కార్యక్రమాల్లో కొడుకుని ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి బాబు.. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఎన్నికలు జరిగి పద్దెనిమిది నెలల గడుస్తున్నా జిల్లాలో ఆయన పాత్ర ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ కార్యక్రమాలను కూడా తండ్రీకొడుకులు ఇద్దరూ పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది.
ఫలితంగానే టీడీపీ అధిష్టానం కూడా వారిద్దరిని పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ఇటీవల టీడీపీ జాతీయ, రాష్ట్ర పదవులను పలువురు నేతలకు కట్టబెట్టింది. అయితే టీడీపీ జాతీయ కార్యవర్గంలో కానీ, పొలిట్ బ్యూరోలో కానీ, చివరకు రాష్ట్ర కార్యవర్గంలో కానీ మాగంటి బాబు పేరు కానీ ఆయన రాజకీయ వారసుడు రాంజీ పేరు కానీ ఎక్కడా కనిపించలేదు.

నియోజకవర్గాల్లో పెద్దగా గుర్తింపు లేని నాయకులకు కూడా పార్టీ పదవులు కట్టబెట్టిన చంద్రబాబు టీమ్… మాగంటి బాబు కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాగంటి.. తన సన్నిహితుల దగ్గర టీడీపీలో ఉండలేమని తేల్చి చెప్పారట. ఇప్పటికే ఏలూరు నుండి సినీ పరిశ్రమకు చెందిన అంబికా కృష్ణ బీజేపీలో జాయిన్ అయ్యి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాగంటి బాబు కూడా బీజేపీలో జాయిన్ అయ్యి ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాలతో మళ్లీ రాజకీయంగా నిలబడాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మూడు తరాలుగా తిరుగులేని రాజకీయ నాయకులుగా వెలిగిన మాగంటి బాబు కుటుంబాన్ని.. చంద్రబాబు పూర్తిగా రాజకీయ సమాధి చేశారని ఆయన అనుచర వర్గం విమర్శిస్తోంది. ఒకవేళ టీడీపీని వీడి బీజేపీలో చేరితే.. మాగంటి బాబు మళ్లీ రాజకీయంగా పుంజుకుంటారో.. లేక కనుమరుగు అవుతారో కాలమే నిర్ణయిస్తుంది.