‘నా భర్తను ఎమ్మెల్యే, అతడి అనుచరులే చంపారు’ : టీడీపీ నేత సుబ్బయ్య భార్య

10TV Telugu News

TDP leader Subbaiah’s wife parajitha responds on the murder of His husband  :  తన భర్తను హత్య చేసింది ఎమ్మెల్యే, ఆయన అనుచరులేనని నందం సుబ్బయ్య భార్య పరాజిత ఆరోపిస్తున్నారు. ప్రసాద్‌రెడ్డి, బంగారురెడ్డితోపాటు, కమిషనర్‌ను అరెస్ట్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. తన భర్త మొబైల్‌లో అన్ని ఆధారాలు ఉన్నాయని… దాన్ని మాయం చేశారన్నారు. మాయం చేసిన మొబైల్‌ దొరికితే నిందితులెవరో తేలుతుందని చెప్పారు. తన భర్త ఎక్కడికి వెళ్లాడో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యిందన్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తే నిందితులెవరో తెలుస్తుందని తెలిపారు. తన భర్త హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్
చేశారు.

మంగళవారం టీడీపీ నేత సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. పేదలకు ఇచ్చే ప్లాట్లలోనే సుబ్బయ్యను హతమార్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నందం సుబ్బయ్య హత్యతో… ప్రొద్దుటూరులో హైటెన్షన్‌ నెలకొంది. నందం సుబ్బయ్య అంత్యక్రియలను నిర్వహించోమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. సుబ్బయ్య హత్యకు కారకులైన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు దహన సంస్కారాలు నిర్వహించేది లేదని తెగేసి చెబుతున్నారు. నారా లోకేశ్‌ వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దీంతో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది.

నందం సుబ్బయ్య కుటుంబ సభ్యులను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌తోపాటు ఇతర నేతలు పరామర్శించారు. సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. నందం సుబ్బయ్యది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే, వైసీపీ నేతల అక్రమాలను సోషల్‌ మీడియాలో నిలదీస్తున్నందుకే సుబ్బయ్యను హత్య చేశారన్నారు. తక్షణమే నిందితులపై కేసు నమోదు చేసి… అరెస్ట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.