జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, సాక్ష్యం ఇదే

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ పాలనపై ఫైర్ అయ్యారు. ఏడాదిలో జగన్ మాఫియా రాజ్యం

10TV Telugu News

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ పాలనపై ఫైర్ అయ్యారు. ఏడాదిలో జగన్ మాఫియా రాజ్యం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జగన్ పాలనపై ఫైర్ అయ్యారు. ఏడాదిలో జగన్ మాఫియా రాజ్యం తెచ్చారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో ముసలం ప్రారంభమైందన్నారు. వైసీపీ ఏడాది పాలనపై ధ్వజమెత్తిన ఆ పార్టీ ఎమ్మెల్యేలే అందుకు సాక్ష్యం అని చెప్పారు. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడమే దీనికి కారణం అన్నారు. వైఫల్యాలపై నిలదీస్తారనే భయంతోనే జనంలోకి రాలేక జగన్ తప్పించుకుని తిరుగుతున్నారని యనమల అన్నారు. 

జగన్ తప్పించుకుని తిరుగుతున్నారు:
ఏడాది పాలనలో రూపాయి అభివృద్ధి కూడా చేయలేదని వైసీపీ ఎమ్మెల్యేలే చెప్పారని యనమల గుర్తు చేశారు. ఈ వాస్తవాలను జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని యనమల కామెంట్ చేశారు. ఏడాది పాలనలో విధ్వంసం తప్ప ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని యనమల విమర్శించారు. జగన్ చేతకానితనం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని ఆయన వాపోయారు. ఏడాది పాలనతో తాను చేసింది చెప్పుకోలేకనే జగన్ మీడియా ముందుకు కూడా రాలేకపోతున్నారని యనమల అన్నారు.

నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అధికారులను చూడలేదు-ఆనం
ఇటీవల అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతలపైనే విమర్శలకు దిగడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం అధికారులపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆనం వాపోయారు. స్వయంగా సీఎం జగన్ చెప్పినా అధికారులు లెక్క చేయడం లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా తన నియోజకవర్గంలో ఏ పనీ చేయలేకపోతున్నా అని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి ఒక్క రూపాయి పని చేపట్టలేదని.. అసలు వెంకటగిరి నియోజకవర్గం ఉందా? తీసేశారా? లేక, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, పాలకులు మరచిపోయారా అంటూ విరుచుకుపడ్డారు. తాను ఇక్కడి నుంచి గెలవడం వెంకటగిరి ప్రజలకు శాపంగా మారిందా.. తన మీద కక్షకట్టి నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. 

అధికారంలో ఉన్నా సమస్యలు తీర్చలేకపోతున్నా-మహీధర్ రెడ్డి
అటు ప్రకాశం జిల్లా కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తీరు ఆసక్తికరంగా మారింది. ఆయన ఒంగోలు జడ్పీ ఆఫీస్ ఎదుట బైఠాయించడం చర్చనీయాంశమైంది. కందుకూరు నియోజవర్గానికి సంబంధించిన సమస్యలపై సీఈవో కైలాస్‌ గిరీశ్వర్‌తో చర్చించేందుకు వెళ్లారు. తాగునీటి పథకాల నిర్వహణతో పాటు ఇతర బిల్లుల చెల్లింపు విషయమై సీఈవోను ప్రశ్నించారు. ఆ అంశాలపై పూర్తి సమాచారం ఇస్తేనే ఇక్కడి నుంచి వెళతానని తేల్చి చెప్పి అక్కడే కూర్చున్నారు. అధికారులకు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇలా రోజుల వ్యవధిలో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం అధికారులపై విమర్శలు చేయడం, నిరసనలకు దిగడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.

Read: ఇక గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ అనే తేడా కనిపించదు.. ఎందుకంటే?

10TV Telugu News