కేపిటల్ ఫైట్, ఆ భయంతో చంద్రబాబుకి మద్దతివ్వలేకపోతున్న తమ్ముళ్లు

  • Published By: naveen ,Published On : August 12, 2020 / 12:03 PM IST
కేపిటల్ ఫైట్, ఆ భయంతో చంద్రబాబుకి మద్దతివ్వలేకపోతున్న తమ్ముళ్లు

ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతోంది. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదనేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ అంశం చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. మరికొంత కాలం ఇదే అంశం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు నడుస్తాయని అంటున్నారు. అమరావతి అంశంలో చంద్రబాబు పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు. కానీ, వాటిని అమలు చేయడంలో మాత్రం బాబు వ్యూహానికి తగ్గట్టుగా టీడీపీ నేతలు వ్యవహరించ లేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

తమ్ముళ్ల తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి:
రాజధాని అంశంలో పార్టీ నేతల తీరుపై అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. అమరావతి విషయంలో రాష్ట్ర విభజన సందర్భంగా చేసిన పోరాటం కంటే ఎక్కువ ఉద్యమం చేయాలని వారికి సూచించారట. అప్పట్లో ఎంపీలు పార్లమెంట్‌లో చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పార్టీ నేతలకు చెప్పారని అంటున్నారు. కానీ, అమరావతి విషయంలో చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేసేందుకు టీడీపీ నేతలు అంత సుముఖంగా లేరనే వాదనలు వినిపిస్తున్నాయి.

టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు?
నేతలు వెనుకంజ వేయడానికి చాలా కారణాలే ఉన్నాయని అంటున్నారు. టీడీపీ తరఫున రాజకీయంగా యాక్టివ్‌గా ఉండే నేతలను అధికార పార్టీ టార్గెట్ చేస్తోందని, కేసులు పెట్టి వేధిస్తోందని టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట. మరోవైపు మూడు రాజధానులు వద్దంటే తమ ప్రాంతాల్లో తాము ఎక్కడ ఇబ్బంది పడతామో అనే ఆందోళన కూడా వారిని వెంటాడుతున్నట్టు టాక్. ఈ కారణంగానే అమరావతి విషయంలో పార్టీ అధినాయకత్వం ఇచ్చిన సూచనలు పలువురు నేతలు పాటించలేక పోతున్నారని అభిప్రాయపడుతున్నారు.

అప్పటికీ కొందరు నేతలు ముందుకొచ్చి అమరావతి అంశంలో గళం వినిపిస్తున్నా.. పూర్తి స్థాయి పోరాటానికి మాత్రం సిద్ధం అయ్యే విషయంలో మాత్రం ఊగిసలాడుతున్నారని చెబుతున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు కొత్త వ్యూహాలు ఏమైనా అమలు చేస్తారేమో చూడాలని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.