అందుకే ఆగిపోయారా? : టీడీపీ ఎమ్మెల్సీల హస్తిన టూర్‌ వాయిదా!

  • Published By: sreehari ,Published On : February 18, 2020 / 09:59 PM IST
అందుకే ఆగిపోయారా? : టీడీపీ ఎమ్మెల్సీల హస్తిన టూర్‌ వాయిదా!

శాసనమండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను అడ్డుకుని పైచేయి సాధించామన్న సంతోషం ఇప్పుడు టీడీపీకి దూరమైపోయిందంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పైచేయి తమదే అని భావించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా డీలా పడిపోయిందని అంటున్నారు. ఈ విషయంపై ఢిల్లీలో తేల్చుకునేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధపడుతున్నారట. ఎమ్మెల్సీలంతా కలిసి హస్తినకు వెళ్లి తమ వాదనను వినిపించాలని భావిస్తున్నారు. నిజానికి ఈపాటికే ఢిల్లీ ప్రయాణం జరగాల్సి ఉంది. కానీ, కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు ఖరారు కాకపోవడంతో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. మరోపక్క, మంచి రోజు చూసుకొని వెళ్తే మంచిందని భావిస్తున్నారట. 

టీడీపీ డీలా పడినట్లేనా?:
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ అయినా కూడా కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు లేకుండా వెళ్లడం వల్ల ప్రయోజనం లేదని భావించి, తమ టూర్‌ను వాయిదా వేసుకున్నారని అంటున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు వ్యవహారంలో శాసనమండలిలో పైచేయి సాధించిన టీడీపీ ఇప్పుడు కాస్త డీలా పడినట్టుగా కనిపిస్తోందని చెబుతున్నారు. నిబంధన 154 ప్రకారం విచక్షణాధికారంతో చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని సెక్రటరీ అమలు పరచాల్సిందే అని ఇన్ని రోజులు టీడీపీ చెబుతూ వచ్చింది. కానీ, సెక్రటరీ మాత్రం సెలెక్ట్‌ కమిటీకి పంపకుండా ఫైల్‌ను చైర్మన్‌కు తిరిగి పంపించేశారు. 

టీడీపీలో నేతల్లో అయోమయం :
చైర్మన్ రూలింగ్ అమలు పరచకపోతే సభాహక్కుల ఉల్లంఘన కింద సెక్రటరీపై చర్యలు తప్పవని టీడీపీ వాదిస్తోంది. ఫైల్‌ను ఇప్పటికే రెండుసార్లు చైర్మన్‌కు తిప్పిపంపించారు సెక్రటరీ. 48 గంటల్లో తన రూలింగ్‌ను అమలు పరచకపోతే నిబంధన ప్రకారం చర్యలు తప్పవని చైర్మన్ హెచ్చరించినా సెక్రటరీ పట్టించుకోవడం లేదంటున్నారు.

ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే సెక్రటరీ పని చేసే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇది మనీ బిల్లు కాదు కాబట్టి 14 రోజుల నిబంధన వర్తించదని మండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. గవర్నర్‌కి ఫిర్యాదు చేయాలా? లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అనే చర్చ సాగుతోందని చెబుతున్నారు. 

మంగళవారం సాయంత్రం ఉపరాష్ట్రపతిని కలిసేందుకు ఎమ్మెల్సీలు అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ చేసుకున్నప్పటికీ దానిని రద్దు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే ఈ పర్యటనను రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు లేకుండా ఒక్క ఉపరాష్ట్రపతిని కలిసి రావడం వల్ల ప్రయోజనం లేదు.

దీనిపైన విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఈ టూర్‌ను రద్దు చేసుకున్నారని అనుకుంటున్నారు. మరోపక్క, న్యాయస్థానాల్లో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినందు వల్ల కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని టీడీపీ వాదిస్తోంది. కమిటీ ఏర్పాటును అధికార పార్టీ అడ్డుకోవడం వల్ల ఆ పార్టీకే నష్టమని అభిప్రాయపడుతోంది. 

బడ్జెట్ లేకుండా జీతాలు ఎలా? :
మండలిని రద్దు చేసినట్టుగా రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేవరకు సమావేశాలు జరపాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. మండలిలో బడ్జెట్ పెట్టకుండా జీతాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో పట్టుదలతో ఉన్న టీడీపీ.. ఎలాగైనా సెక్రటరీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చేందుకు రెడీ అవుతోందంట. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులతో కలిసి ముందుకు వెళ్తోంది.

బీజేపీ సభ్యులతో కలిసి ఢిల్లీ పెద్దలను కలవాలని ప్లాన్ చేస్తున్న టీడీపీ… ఆ మేరకే టూర్‌ ప్లాన్‌ చేసుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ టూర్‌ను రద్దు చేసుకుంది. ఓ పక్క ఆందోళనలో ఉన్నప్పటికీ శాసనమండలి రద్దు చేయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుందనే ధీమా మాత్రం వ్యక్తం చేస్తోంది.