మండలిలో సత్తా చూపించిన ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేగా చాన్స్ ఇస్తారంట!

  • Published By: sreehari ,Published On : August 7, 2020 / 07:20 PM IST
మండలిలో సత్తా చూపించిన ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేగా చాన్స్ ఇస్తారంట!

కేవలం 23 మంది శాసనసభ్యులతో ఏపీ అసెంబ్లీలో అధికార పక్షంపై పోరాటం చేయలేక రకరకాలుగా ఇబ్బందులు పడుతోంది ప్రతిపక్ష టీడీపీ. ఉన్న 23 మందిలో ముగ్గురు పార్టీకి దూరం అయ్యారు. అదే సందర్భంలో శాసన మండలిలో మాత్రం అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు టీడీపీ ఎంఎల్‌సీలు. మండలిలో టీడీపీకి మెజారిటీ సభ్యులు ఉండటం, ప్రతిపక్ష నేతగా యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ ఉండటం పార్టీకి కలసివచ్చింది. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని బంతిలా ఆడుకుంటున్న అధికారపక్షం శాసన మండలిలో మాత్రం డీలా పడిపోతోంది.

మరో రెండు ఏళ్లు ఆగితే.. :
శాసనమండలిలో టీడీపీకి 30 మంది సభ్యులు పైగా ఉన్నారు. సంఖ్యాబలం రీత్యా మండలిలో అధికార పార్టీకి అందనంత దూరంలో ఉంది ప్రతిపక్షం. మరో రెండు సంవత్సరాలు ఆగితే గానీ మండలిలో పూర్తి ఆధిపత్యం చెలాయించే అవకాశం వైసీపీకి లేదు. శాసనమండలిని మొదట్లో లైట్‌గా తీసుకుంది వైసీపీ. ఎంతలా అంటే కనీస శాసనమండలి నిబంధనలు, సాంప్రదాయాలు కూడా తెలుసుకోలేనంత. ఇదే అదునుగా భావించిన టీడీపీ గత జనవరిలో మూడు రాజధానులు బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై అధికార పార్టీకి చుక్కలు చూపించింది. నిబంధనలు తెర మీదకు తీసుకొచ్చి శాసనమండలిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంది.



సెలక్ట్ కమిటీకి బిల్లు పంపాలని :
సెలక్ట్ కమిటీకి బిల్లు పంపించాలని నిర్ణయించారు మండలి చైర్మన్‌. కానీ, నిబంధనల ప్రకారం చైర్మన్‌ నడుచుకోలేదని సెక్రెటరీ ప్రకటించి, సెలెక్ట్ కమిటీలను పెండింగ్‌లో పెట్టారు. జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మళ్లీ శాసనమండలిలో బిల్లు పెట్టినా ప్రతిపక్షం టీడీపీ అడ్డుకుంది.

ఇప్పటికే టీడీపీకి చెందిన పోతుల సునీత, శివనాథ్‌రెడ్డి, శమంతకమణి వైసీపీతో కలసి పని చేస్తున్నారు. టీడీపీ సభ్యుడైన డొక్కా మాణిక్య
ప్రసాద్ మాత్రం రాజీనామా చేసి, అధికార పార్టీ నుంచి శాసనమండలిలో అడుగుపెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి చెందిన సభ్యులను తమ దారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. తమ సభ్యుల కాపాడుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.



అసెంబ్లీ టికెట్లపై ఆశలు :
ఒకానొక దశలో పది, పదిహేను మంది ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేరడం ఖాయం అని అందరూ భావించారు. చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడుతూ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ చర్చలో భాగంగా తమ కోర్కెల చిట్టాను తమ అధినేత ముందు ఉంచారట ఎమ్మెల్సీలు. ఎక్కువ మంది అసెంబ్లీ టిక్కెట్లపై మనసు పడుతున్నారని అంటున్నారు.

ఎమ్మెల్సీలు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి ప్రతిష్ట కాపాడారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న వారిలో కొందరికి అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. కానీ, ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉండగా ఇప్పటి నుంచే
దీనిపై హామీ ఇవ్వడాన్ని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారట.

సాలూరు అసెంబ్లీ నుంచి పోటీ :
చంద్రబాబు నుంచి హామీ పొందినవారిలో గుమ్మడి సంధ్యారాణి విజయనగరం జిల్లా సాలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారట. సాలూరు నుంచి ప్రస్తుతం భాంజ్ దేవ్ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. బుద్ధా వెంకన్నకు విజయవాడ పశ్చిమ, బచ్చుల అర్జునుడుకు కృష్ణా జిల్లాలో ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం, బీదా రవిచంద్రకు కావలి అసెంబ్లీ సీటు , దీపక్‌రెడ్డికి అనంతపురం జిల్లా రాయదుర్గం లేదా మరేదైనా స్థానం కేటాయించేందుకు చంద్రబాబు ఓకే చెప్పినట్లు సమాచారం.



ఇప్పటికే రాయదుర్గం నుంచి మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తిప్పేస్వామికి సైతం హిందుపురం పార్లమెంట్ సీటు ఇచ్చేందుకు అధినేత హామీ ఇచ్చారట. ప్రస్తుతం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప హిందూపురం పార్లమెంట్ ఇన్‌చార్జిగా ఉన్నారు.

బీటెక్ రవికి పులివెందుల అసెంబ్లీ :
కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీటెక్ రవికి సైతం పులివెందుల అసెంబ్లీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటి వరకు అక్కడ ఉన్న సతీష్ రెడ్డి పార్టీని వీడారు. కర్నూలు జిల్లాలో పార్టీకి దూరంగా ఉన్న ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అధినేతతో చర్చల అనంతరం మళ్లీ పార్టీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు.

ఆయనకు అసెంబ్లీ టికెట్‌ ఓకే చేశారని టాక్. ఇప్పటికే వీరి కుటుంబ సభ్యులు డోన్, పత్తికొండలకు ఇన్‌చార్జీలుగా ఉన్నారు. మరో ఎంఎల్సి బీటీ నాయుడుకి సైతం అసెంబ్లీ గానీ లోక్‌సభ టికెట్‌ గానీ ఇస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రామ్మోహన్ కూడా పాలకొల్లు అసెంబ్లీ స్థానంపై గట్టిగా పట్టుబడినట్లు సమాచారం. అధినేత మాత్రం ఈ విషయంలో హామీ ఇవ్వలేదట. ఎందుకంటే అక్కడ టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే జిల్లా కి చెందిన మంతెన సత్యనారాయణ రాజుకి సైతం కీలక బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చారట.



విజయనగరం జిల్లాకి చెందిన ద్వారపు రెడ్డి జగదీశ్‌, విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, బుద్ధ నాగ జగదీశ్వర్రావుకి కూడా కొంత సమయం ఇస్తే ఏదో ఒక అసెంబ్లీ అప్పజెప్తామని బాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. మరో ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయ రామరాజు కుటుంబ సభ్యులకు కురుపాం అసెంబ్లీ బాధ్యతలు అప్పగించారు.

ఈ విధంగా చూస్తే వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్సీలను సంతృప్తి పరచాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనలు బాగానే ఉన్నాయి కానీ ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇన్చార్జిలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. అంతేకాకుండా అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. కానీ చంద్రబాబుకు మాత్రం ఇప్పటి నుంచే రాజకీయం మొదలుపెట్టేశారు.