పార్టీలో కొత్త రగడ : మండలిలో టీడీపీ ఎత్తుగడ! 

  • Published By: sreehari ,Published On : January 22, 2020 / 02:32 PM IST
పార్టీలో కొత్త రగడ : మండలిలో టీడీపీ ఎత్తుగడ! 

మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రభుత్వం ముందున్న ఒకే ఒక ఆప్షన్‌ శాసన మండలి. ఎందుకంటే ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర పక్షాలకు బలమున్నది అక్కడే. దీంతో మండలి వేదికగా ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ప్లాన్‌ వేసుకుంది.

దానిని అమలు చేసేందుకు వీలుగా రూల్‌ 71ని ముందుకు తీసుకొచ్చింది. బిల్లులపై చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టింది. దీనికి ఎవరెవరు మద్దతిస్తారన్న దానిపై ఓటింగ్‌ నిర్వహించింది. ఈ విషయంలో ప్రభుత్వం దాదాపు ఇరకాటంలో పడింది. ఎందుకంటే అక్కడ టీడీపీకి పూర్తి బలం ఉంది. కొన్ని పక్షాలు కూడా టీడీపీకి మద్దతుగా నిలిచాయి. ఇంకేముంది ప్రభుత్వంపై విజయం సాధించామనే భావించింది.

పావులు కదుపుతున్న వైసీపీ :
మండలిలో ఎలాగైనా బిల్లును పాస్‌ చేయించుకోవడానికి అధికార వైసీపీ పావులు కదపడం ప్రారంభించింది. తొలి రోజు లంచ్‌లోపే ఆ టీడీపీకి షాక్‌ తగిలింది. మండలిలో తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ప్రకటించారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పేశారు.

కానీ, ఆయన రాజీనామా వెనక వైసీపీ హస్తముందన్న ప్రచారం సాగింది. మరో ఇద్దరు సభ్యులు శత్రుచర్ల విజయరామరాజు, శమంతకమణి సభకు గైర్హాజయ్యారు. ఇందుకు వారు తమ సొంత కారణాలను అధిష్టానానికి తెలియజేశారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ, పోతుల సునీత, శివనాథ్‌రెడ్డి పార్టీ విప్‌ను ధిక్కరించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు.

టీడీపీకి షాకిచ్చిన వారిద్దరు :
సునీత, శివనాథ్‌రెడ్డి నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ షాకయ్యింది. ప్రభుత్వంపై పైచేయి సాధించామన్న ఆనందాన్ని ఎంతో సేపు నిలవనీయకుండా ఆ ఇద్దరు సభ్యులు చేశారని పార్టీ వర్గాలు మండిపడుతున్నాయట. అంతేనా.. వారిపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది.

మరోపక్క ఒక సభ్యుడు రాజీనామా ప్రకటించడం.. ఇద్దరు సభ్యులు గైర్హాజరు కావడం వెనుక కూడా అధికార వైసీపీ వ్యూహం ఉందనే టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం పోతుల సునీత వైసీపీలో చేరడం ఖాయమైందని చెబుతున్నారు. మొత్తం మీద మండలిలో ప్రభుత్వంపై పైచేయి సాధించామన్న ఆనందాన్ని టీడీపీకి ఎక్కువ సేపు ఉండకుండా ఈ వ్యవహారం చేసిందని జనాలు అంటున్నారు.