విశాఖలో వాలంటీర్ వేధింపులు తట్టుకోలేక టీడీపీ సీనియర్ నేత డ్రైవర్ ఆత్మహత్య?

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. వాలంటీర్ వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Published By: naveen ,Published On : May 30, 2020 / 08:55 AM IST
విశాఖలో వాలంటీర్ వేధింపులు తట్టుకోలేక టీడీపీ సీనియర్ నేత డ్రైవర్ ఆత్మహత్య?

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. వాలంటీర్ వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. వాలంటీర్ వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి  బండారు సత్యనారాయణ మూర్తి డ్రైవర్ కావడం కలకలం రేపుతోంది. మృతుడి పేరు సన్యాసినాయుడు. విశాఖ జిల్లా పరవాడ మండలం కలపాకలో ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంలో చనిపోయాడు.

తప్పుడు పత్రాలతో ఇంటి నిర్మాణం అడ్డుకున్న వాలంటీర్:
మాసపు సన్యాసినాయుడు మాజీ మంత్రి బండారు దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి నిర్మాణాన్ని స్థానికంగా ఉన్న వాలంటీర్ నరసింగరావు, వైసీపీ నేతలు అడ్డుకున్నారని వాట్సాప్‌లో ఆడియో రికార్డ్ చేశాడు. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా గ్రామానికి చెందిన వాలంటీర్, స్థానిక వైసీపీ నేతలు అడ్డుకున్నారని నాయుడు ఆరోపించాడు. ఇల్లు నిర్మిస్తున్న స్థలం వేరొకరిదంటూ వాలంటీర్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాడని.. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారులను కలిసి న్యాయం చేయమని కోరినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

రూ.50వేలు డిమాండ్ చేసిన వాలంటీర్:
తనకు ఎవరూ సాయం చేయకపోగా ఇంటి నిర్మాణాన్ని ఆపేశారని.. రూ.50వేలు ఇస్తేనే ఇంటి నిర్మాణానికి అనుమతిస్తామని వాలంటీర్ చెప్పాడని.. వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నా అని నాయుడు ఆడియోలో తెలిపాడు. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఎవరెవరు కారణమో పేర్లతో సహా తెలిపాడు. జరిగిన సంఘటనంతా వాట్సావ్‌ ఆడియోలో రికార్డ్ చేశాడు. నాయుడు మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాయుడు మృతికి కారణమైన వాలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

1

Read: కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి