వల్లభనేని వంశీపై వేటు: ఎమ్మెల్యే పదవికి రాజీనామా డిమాండ్

  • Published By: vamsi ,Published On : November 15, 2019 / 09:43 AM IST
వల్లభనేని వంశీపై వేటు: ఎమ్మెల్యే పదవికి రాజీనామా డిమాండ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మీడియా సమావేశం పెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చర్యలు తీసుకుంది ఆ పార్టీ అధిష్టానం. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది.

ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఆయనకు షోకాజ్‌ నోటీసు విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్‌పై వంశీ చేసిన విమర్శలను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వంశీ పార్టీని వీడి వైసీపీలో చేరడం దాదాపు ఖాయం అవగా.. గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కూడా టీడీపీలో చర్చ సాగింది. ప్రస్తుతానికి అయితే వంశీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది తెలుగుదేశం పార్టీ.