TDP Target : కృష్ణా జిల్లాలో ఆ ముగ్గురే టీడీపీ టార్గెట్.. ఓడిస్తాం అంటూ తొడకొట్టిన తెలుగుదేశం నేతలు

కృష్ణా జిల్లా టీడీపీ నేతలు తొడలు కొట్టారు. జిల్లాలో ఆ ముగ్గురే తమ టార్గెట్ అని చెప్పారు. వారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వం అన్నారు.

TDP Target : కృష్ణా జిల్లాలో ఆ ముగ్గురే టీడీపీ టార్గెట్.. ఓడిస్తాం అంటూ తొడకొట్టిన తెలుగుదేశం నేతలు

TDP Target : కృష్ణా జిల్లా టీడీపీ మీటింగ్ లో ఆ పార్టీ నేతలు తొడలు కొట్టారు. జిల్లాలో ఆ ముగ్గురే తమ టార్గెట్ అని చెప్పారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ లను ఓడిస్తాం అంటూ చాలెంజ్ చేశారు. వారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వం అన్నారు.

బీఫామ్ ల కోసం కొడాలి నాని చంద్రబాబు బూట్లు నాకాడాని, అలాంటి వారు ఇప్పుడు చంద్రబాబు ఫ్యామిలీపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇచ్చిన పార్టీ టికెట్ మీద కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యారని, కన్నతల్లి లాంటి టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసిన మీరు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు టీడీపీ నేతలు. స్టేజిపైన ఆవేశంగా మాట్లాడిన మాజీ మంత్రి దేవినేని ఉమ తొడకొట్టారు. అంతేకాదు రావి వెంకటేశ్వరరావుతోనూ తొడ కొట్టించారు.

”వాళ్లు బతుకులు ఏంటో అందరికీ తెలుసు. బీఫామ్ ల కోసం చంద్రబాబు కాళ్ల మీద ఎలా పడ్డారో, ఏ విధంగా రెకమెండేషన్ చేయించుకున్నారో, ఎవరెవరితో చెప్పించారో నీకు తెలుసు మాకు తెలుసు. కానీ, ఇవాళ వాళ్లు మాట్లాడుతున్న భాష దారుణం. సభ్య సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు. ఇటువంటి వ్యక్తులను తరిమితరిమి కొట్టాలి. ఎన్టీ రామారావు కుటుంబసభ్యులపై అసభ్య పదజాలం వాడిన ఆ రెండు మృగాలు.. గుడివాడ, గన్నవరం.. గుర్తుపెట్టుకోవాలి” అంటూ ఆవేశంగా మాట్లాడారు దేవినేని ఉమ.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ లక్ష్యంగా పని చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ విషయంపైనే చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురిని గెలవనివ్వకూడదని టీడీపీ నేతలు నిర్ణయించారు. గుడివాడ, గన్నవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాలని నేతలు సూచించారు. ఈ మూడు నియోజకవర్గాల్లో దేవినేని ఉమ, కొనకొళ్ల నారాయణ, నెట్టెం రఘురాం పాదయాత్ర చేయాలన్నారు. వంద మంది టీడీపీ నేతలు ఈ మూడు నియోజకవర్గాల్లో వంద గ్రామాలు దత్తత తీసుకుని పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు. టీడీపీ నుంచి వెళ్లిన వారే పార్టీ కార్యాలయంపై దాడులు చేస్తున్నారని.. చంద్రబాబు, లోకేశ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారని.. మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రబాబు మండిపడ్డారు.