విశాఖలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. జనాల్లో కొత్త అనుమానాలు

  • Published By: naveen ,Published On : November 24, 2020 / 05:51 PM IST
విశాఖలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. జనాల్లో కొత్త అనుమానాలు

visakha politics: గ్రేటర్‌ విశాఖ.. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2007లో తొలిసారిగా జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. 2012లో పాలకమండలి గడువు ముగిసిన నాటి నుంచి ఇంత వరకూ ఎన్నికలు జరగలేదు. ఈ డిసెంబర్‌ లేదా వచ్చే(2021) ఏడాది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీవీఎంసీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఇప్పటి నుంచే అటు ప్రభుత్వం, ఇటు విపక్షాలు ఈ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఎన్నికల కోసం అస్త్రాలతో రెడీ అవుతున్నాయి. బీజేపీ అయితే ఏ కార్యక్రమమైనా విశాఖ వేదికగానే నిర్వహిస్తోంది. దీంతో జీవీఎంసీ ఎన్నికలే టార్గెట్‌గా కమలం పార్టీ అడుగులు వేస్తోందని అంటున్నారు.

అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు:
అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు లేకుండానే హోరెత్తిస్తున్నాయి. ఒకవైపు నా ఇల్లు.. నా సొంతం అని టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోపక్క, సీఎం జగన్‌ ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు నిండిన సందర్భంగా వైసీపీ ర్యాలీలు చేపడుతోంది. సీఎం జగన్‌ అందరికీ ఇళ్లు ఇస్తామన్నారని, కానీ కట్టిన ఇళ్లు కూడా ఎందుకు ఇవ్వడం లేదంటూ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులతో కలసి ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. జిల్లాలో టీడీపీ సీనియర్‌ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు.

అప్పుడే ఎన్నికలు వచ్చాయా?
విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు లాంటి వారు ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీపై ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో ఇదే ప్రధాన ఎన్నికల హామీలా కనిపిస్తోందని అంటున్నారు. మరోపక్క, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగిసి మూడేళ్లు అయిన నేపథ్యంలో జిల్లా అంతటా యాత్రలు నిర్వహిస్తున్నాయి వైసీపీ శ్రేణులు. మంత్రి అవంతి నగరం అంతా చుట్టేస్తుండగా, వారి వారి నియోజకవర్గాల్లో ఇతర నేతలు తిరుగుతున్నారు. ఈ కోలాహలం అంతా చూస్తుంటే ఇప్పుడే ఎన్నికలు వచ్చాయా అని అనిపిస్తోందని అంటున్నారు.

వ్యూహాలకు పదును పెడుతున్న అధికార, ప్రతిపక్షాలు:
స్థానిక సంస్థలతో పాటు జీవీఎంసీ ఎన్నికలు జరగడం తథ్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అధికార, విపక్షాలు గ్రేటర్ పీఠంపై జెండా ఎగరేయడానికి తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న హడావుడి అంతా జీవీఎంసీ పీఠం కోసమే జనాలు అనుకుంటున్నారు. మరి ఈ వ్యూహ ప్రతివ్యూహాల్లో పైచేయి సాధించేదెవరో చూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=I_LhWhliX_0