నాలుగు జిల్లాల నేతలను పిలిపించిన సీఎం జగన్, ఏం చెప్పారు

నాలుగు జిల్లాల నేతలను పిలిపించిన సీఎం జగన్, ఏం చెప్పారు

MLC Elections : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండబోతుందా ?. ఉపాధ్యాయ సంఘాలకే ఎన్నికలు వదిలెయ్యలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారా?. ఆ నాలుగు జిల్లాల నేతలను పిలిపించిన అధినేత.. ఏం చెప్పి పంపించారు ?. ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలవ్వగా.. నామినేషన్ పక్రియ ప్రారంభం అయ్యింది. ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి మార్చి 14 ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రెండు స్థానాలకు ఉపాధ్యాయ సంఘాల నుండి గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపై అధికార పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకూడదని సీఎం జగన్ నిర్ణయించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. నాన్ పొలిటికల్‌గా జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కలుగచేసుకోవడం సరికాదని భావించిన సీఎం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నాలుగు జిల్లాల మంత్రులు, ముఖ్య నేతలను పిలిచి.. వారికి ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. ఈ నిర్ణయానికి పార్టీ నేతలు కట్టుబడి ఉండాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. పరోక్షంగా ఎవరికైనా మద్దతు ఇచ్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు స్కూళ్లలో మౌళిక వసతులు కల్పించిన విషయాన్ని టీచర్లకు వివరించాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ మద్దతు ఇవ్వాలనుకుంటే సీపీఎం అనుబంధ సంస్థ అయిన యూటీఎఫ్‌ అభ్యర్థులకు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని పార్టీ కీలక నేతలు చెబుతున్నారు.