ఏపీలో ప్రభుత్వ స్కూల్స్‌లో కరోనా కలకలం.. విద్యార్థులు, టీచర్లకు కొవిడ్.. వందల సంఖ్యలో కేసులు నమోదు

  • Published By: naveen ,Published On : November 4, 2020 / 01:01 PM IST
ఏపీలో ప్రభుత్వ స్కూల్స్‌లో కరోనా కలకలం.. విద్యార్థులు, టీచర్లకు కొవిడ్.. వందల సంఖ్యలో కేసులు నమోదు

teachers students tested corona positive: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని నాలుగు జడ్పీ హైస్కూళ్లలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు, అధికారులు ఊలిక్కిపడ్డారు. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, టీచర్‍కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అలాగే పచ్చవ గ్రామంలో ఇద్దరు విద్యార్థులతో పాటు ఒక ఉఫాధ్యాయుడికి వైరస్‌ బారిన పడ్డారు. దీంతో పాటు త్రిపురాంతకం ఓ టీచర్‌, పీసీపల్లిలోని విద్యార్ధితో పాటు టీచర్ కోవిడ్‌ కాటుకు గురయ్యారు.

పెద్దగొల్లపల్లి హైస్కూల్‍లో మరో ఉపాధ్యాయుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఒక్క రోజే ఇన్ని కేసులు రావడంతో జిల్లాలోని మిగితా పాఠశాలలు ఆందోళనకు గురవుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పలు పాఠాశాలల్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు కరోనా చికిత్స శిబిరాలను ఏర్పాటు చేశారు.

చిత్తూరు జిల్లాలోనూ వందల సంఖ్యలో టీచర్లకు కరోనా:
మరోవైపు చిత్తూరు జిల్లాలోనూ వందల సంఖ్యలో టీచర్లు కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా జరిపిన కరోనా పరీక్షల్లో 120 మంది ఉపాధ్యాయులకు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. మొదటి రోజు జరిపిన కోవిడ్ పరీక్షల్లో 57 మందికి, రెండో రోజు జరిపిన టెస్టుల్లో 63 మంది టీచర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇవాళ(నవంబర్ 4,2020) మరికొందరి ఫలితాలు రానున్నాయి. స్కూళ్లు ప్రారంభమైనందున ఉపాధ్యాయులందరికీ కరోనా పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టీచర్లకు కరోనా సోకుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. పిల్లలను స్కూళ్లకు పంపడం ఎంతవరకు సేఫ్‌ అనే ప్రశ్న తలెత్తుతోంది.