జయరాం కేసులో ట్విస్ట్ : ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న పద్మశ్రీ

చిగురుపాటి జయరామ్‌ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ కోరారు.

  • Published By: veegamteam ,Published On : February 6, 2019 / 03:10 AM IST
జయరాం కేసులో ట్విస్ట్ : ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న పద్మశ్రీ

చిగురుపాటి జయరామ్‌ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ కోరారు.

హైదరాబాద్‌ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్, కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ కోరారు. ఈ మేరకు ఆమె మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసుల దర్యాప్తుతోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నానని స్పష్టం చేశారు.

నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. తన భర్తకు విషమిచ్చారని తొలుత అన్నారని, ఆ తర్వాత కొట్టారని, ఇంకోసారి బీరుసీసా కథ అల్లారని.. ఇలా ఏపీ పోలీసులు రోజుకో డ్రామాతో కేసును నీరుగార్చారని మండిపడ్డారు. తన భర్త పోస్టుమార్టం నివేదిక కావాలని గత నాలుగు రోజులుగా నందిగామ పోలీసులను కోరుతున్నా.. ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే ఈ హత్య జరిగినందున, ఇక్కడి పోలీసులే దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష వేసి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ హత్య కేసులో తన భర్త మేనకోడలు శిఖాచౌదరి పాత్ర ఉన్నా, కొంతమంది వ్యక్తులు ఆమెను తప్పించారని ఆరోపించారు. తన భర్త హత్య కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తుతోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నానని స్పష్టం చేశారు.

 

ఒక్క మనిషి ప్రాణం ఖరీదు రూ.6 లక్షలు, రూ.80 లక్షలు, రూ.నాలుగు కోట్లు, ఒక డాలరా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. మేనమామ చనిపోయాడని తెలిస్తే శిఖాచౌదరి ఘటనాస్థలికి వెళ్లకుండా తమ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి బీరువాలోని విలువైన పత్రాలు తీసుకెళ్లడమే అనుమానాలకు తావిస్తోందని పద్మశ్రీ పేర్కొన్నారు. కేసు నుంచి శిఖా చౌదరిని తప్పించేందుకు ఏపీలోని కొన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 

 

హత్య హైదరాబాద్‌లో జరిగితే కేసును ఏపీలో దర్యాప్తు చేయడమేంటో తనకు అర్థం కావడం లేదన్నారు. అందుకే తనకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. 30 ఏళ్ల తమ వైవాహిక జీవితం ఆనందకరంగా ఉండేదని, తన భర్త హత్యతో ఇద్దరు పిల్లలు తండ్రి లేని వారయ్యారని, తమ కుటుంబం రోడ్డున పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పద్మశ్రీ ఫిర్యాదు స్వీకరించిన అనంతరం జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీహరిచంద్రరెడ్డి..  ఆమెను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.