పార్టీ పెట్టిన 9నెలల్లోనే అధికారంలోకి.. టీడీపీకి 40ఏళ్లు!

పార్టీ పెట్టిన 9నెలల్లోనే అధికారంలోకి.. టీడీపీకి 40ఏళ్లు!

Telugu Desam Party

Telugu Desam Party: సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు నినాదంతో సినీనటుడు నందమూరి తారకరామారావు..రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీని ప్రకటించి 40 ఏళ్లు నిండాయి. ఈ సంధర్భంగా.. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారకరామారావు హైదరాబాద్‌లోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీని ప్రకటించారు.

పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే.. అంటే 1983 జనవరిలో తొలి సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొని.. ఆ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్నారు. టీడీపీకి మొత్తం 294 స్థానాలకుగానూ 203స్థానాలు రాగా.. ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు చరిత్ర సృష్టించారు. నాటి నుంచి మొత్తం 9సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న టీడీపీ.. 5 సార్లు అధికారంలోకి వచ్చి, 21 ఏళ్లు అధికారంలో ఉంది.

1985లో 35 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ.. పార్లమెంటులో ప్రతిపక్ష హోదాని సైతం దక్కించుకుంది. తర్వాతి కాలంలో జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టి నేషనల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1995 ఆగస్టులో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు అదే పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. రాష్ట్ర విభజన 2014లో నవ్యాంధ్రకు జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది.

ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసింది. ఆవిర్భావం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చిన పార్టీ తిరిగి పూర్వవైభవం కోసం కృషి చేస్తోంది. ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే వేడుకల్లో చంద్రబాబుతో పాటు ముఖ్యనేతలంతా పాల్గొననున్నారు.