ముందుకు వెళ్లలేక..వెనక్కి రాలేక : కౌలాలంపూర్‌లో తెలుగు విద్యార్థులు విలవిల

  • Published By: madhu ,Published On : March 18, 2020 / 04:07 AM IST
ముందుకు వెళ్లలేక..వెనక్కి రాలేక : కౌలాలంపూర్‌లో తెలుగు విద్యార్థులు విలవిల

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థులు 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం  సూచించింది. దీంతో వందలాది మంది తెలుగు విద్యార్థులు మంగళవారం ఉదయం ఫిలిప్పీన్స్‌లోని మనీలా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి కౌలాలంపూర్‌ చేరుకున్నారు. కానీ అక్కడే వారిని అధికారులు ఆపివేశారు. వెనక్కు వెళ్లిపోవాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు చెబుతున్నారు. కానీ పిలిప్పీన్స్ అధికారులు మాత్రం నో ఎంట్రీ అంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. 

ఎయిర్‌పోర్టు అధికారులు తమ నుంచి పాస్‌పోర్టులు తీసుకున్నారని.. బోర్డింగ్‌ పాస్‌లను ఇస్తామని తెలిపినా ఇప్పుడు ఎంబసీ పర్మిషన్ లేకుండా వెళ్లేందుకు వీలు లేదంటున్నారని  అక్కడున్నవారు వాపోతున్నారు. ఇప్పటికే కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో వందలమంది చిక్కుకుపోయారు. వారికి తోడు ఇప్పుడు అదనంగా పిలిప్పీన్స్ నుంచి మరో విమానం కౌలాలంపూర్‌ చేరుకోబోతోంది.

అందులోనూ ఎక్కువమంది భారతీయులే. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల వారు, తెలంగాణలోని హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాల విద్యార్థులు ఇక్కడ చిక్కుకుపోయారు. భారత్‌ వచ్చే విమానాలన్నీ రద్దవ్వడంతో వారంతా విమానాశ్రయంలో రోజంతా పడిగాపులు కాశారు. విద్యార్థుల బాధను అర్ధం చేసుకున్న 10tv వరుస కథనాలను ప్రసారం చేసింది.

అక్కడి విద్యార్థుల ఆవేదనను కళ్లకు కట్టినట్లు చూపించింది. దీంతో భారత ఎంబసీ అధికారులు స్పందించారు. కౌలాలంపూర్‌లో చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌ ఏషియా విమానాలను భారత్‌కు అనుమతిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ప్రకటనతో ఊరట లభించినట్లయింది. అయితే.. భారత ఎంబసీ అనుమతి లేకుండా విమానం ఎక్కేందుకు వీల్లేదని ఎయిర్‌‌పోర్ట్ అధికారులు విద్యార్థులను అడ్డుకుని ఆపేయడంతో వారి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. 

Read More : కరోనా భయంతో ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారని.. $ 1,000 డాలర్ల బోనస్ ప్రకటించిన Facebook