మళ్లీ ఎండల్లో తెలుగు రాష్ట్రాలు

మళ్లీ ఎండల్లో తెలుగు రాష్ట్రాలు

నైరుతి రుతుపవనాలు వెనక్కుతగ్గడంతో తెలుగు రాష్టాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ మించిపోతున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 2- 3డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతల ఫలితంగా కోస్తాలో ఉక్కపోత ఎక్కువగానే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రెండ్రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మంగళవారం విశాఖలో 38డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. బుధవారం ఒంగోలులో అత్యధికంగా 38డిగ్రీలు, బాపట్ల, మచిలీపట్నంలో 37డిగ్రీలు నమోదైంది. 

అప్పుడప్పుడు కురిసే జల్లులకు ఆ మరుసటిరోజే ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఛత్తీస్‌ఘఢ్‌, మధ్యప్రదేశ్‌ పరిసరాల్లో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం నామమాత్రంగా ఉంది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో వచ్చే 24గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావం 48గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని అధికారులు వెల్లడించారు.